కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ అడ్వెంచర్ 'విక్రాంత్ రోణా'. ఈ సినిమాను హిందీలో సల్మాన్ ఖాన్ సమర్పిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో నటించారు. అయితే సినిమా హిందీ ట్రైలర్ లాంచ్ అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ.. మూవీ సక్సెస్‌కు ఫార్మాలా అనేది ఉండదన్నారు. 'అన్ని సినిమాలు మంచి మూవీస్ అనే మొదలు పెడతాం.. కానీ కొన్ని ఆడతాయి. కొన్ని మూవీస్ ఆడవు' అన్నారు సల్మాన్. 'విక్రాంత్ రోణా' బాగా ఆడాలనే తాను ప్రమోషన్స్ చేస్తున్నట్లు చెప్పారు సల్మాన్. ఎందుకంటే నష్టపోవడం తనకు ఇష్టం లేదన్నారు. ఇటీవల కాలంలో సౌత్ సినిమాలు నిజంగా బాగా ఆడుతున్నాయన్నారు.
అనంతరం సుదీప్ సౌత్- బాలీవుడ్ సినిమాలపై మాట్లాడారు. 'కొన్ని దక్షిణాది మూవీస్ హిట్ అయినంత మాత్రాన.. సౌత్ సినిమా డామినేట్ చేస్తుందని అనుకోవద్దు. హిందీ చిత్ర పరిశ్రమ గొప్ప సినిమాలు తీసింది. గొప్ప నటులను అందించింది. లేకుంటే ఇన్ని ఏళ్లు ఎలా కొనసాగుతుంది?' అన్నారు సుదీప్.
అయితే ప్రస్తుతం హిట్ సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న బాలీవుడ్‌ను.. ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీతో పోల్చారు సుదీప్. అలాగని బాలీవుడ్- కోహ్లీని తక్కువ అంచనా వేయలేమన్నారు. 'విరాట్ ఇప్పుడు ఆడకపోతే అతని రికార్డులు చెరిగిపోతాయా? ప్రతి పరిశ్రమలో ఇలాంటి ఆటు పోట్లు వస్తాయి. అయితే తట్టుకొని నిలబడాలి' అని పేర్కొన్నారు.