Rana Saipallavi Virataparvam: అచ్చ తెలుగుకు లంగావోణి వేస్తే... అది సాయిపల్లవిలా ఉంటుంది అంటారు కొందరు. తెలంగాణలోని అమ్మాయిల గడుసు తనానికి గొంతుకనిస్తే... అది ఆమెలానే మాట్లాడుతుందంటారు ఇంకొందరు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూరి పడచు కొంటెతనాన్ని చిత్రంగా గీస్తే... ఆమెలా కనిపిస్తుందంటారు మరికొందరు. తెలుగు ప్రేక్షకులకి తమ ఇంట్లో అమ్మాయిగా మారిపోయిన సాయిపల్లవి ఏ పాత్ర ఇచ్చినా అందులో సహజంగా ఒదిగిపోతుంది. అందుకే ఆమెని అందరూ అంత వేగంగా సొంతం చేసుకున్నారు. గుర్తుండిపోయే పాత్రలు చేసిన సాయిపల్లవి ఇటీవల 'విరాటపర్వం'లో వెన్నెల పాత్రలో నటించింది. రానా దగ్గుబాటి కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సాయిపల్లవివిలేకర్లతో ముచ్చటించారు. సినిమా సంగతులు తెలిపారు.
మీ పాత్రకి స్ఫూర్తి అయిన సరళ కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నారు కదా. వాళ్లెలా స్పందించారు?
ఎట్లున్నవు బిడ్డా, ఎక్కడికి పోయినవు, ఎందుకు ఇంటికి రాలేదంటూ వాళ్ల బిడ్డతో మాట్లాడినట్టే నన్ను పలకరించారు. భావోద్వేగాల్ని ఆపుకోలేకపోయా. నేను కుటుంబంలోకి వెళ్లి వచ్చిన అనుభూతి కలిగింది. సారె ఇచ్చి, బొట్టు పెట్టి పంపించారు. సినిమా చూసి సంతోషించారంటే అదింకా తృప్తినిస్తుంది.
ఇది వెన్నెల కథ కదా! ఇందులో రానా దగ్గుబాటి భాగం కావడంపై మీ అభిప్రాయం ఏమిటి?
రానా శరీర తత్వానికీ, తన గళానికీ, తన స్థాయికి తగ్గ కథ ఇది. ఆయన ఇందులో భాగమయ్యాక సినిమా స్థాయి పెరిగింది. మొదట ఈ కథలో రానా చేస్తున్నాడని నాకు తెలియదు. తను ఈ స్క్రిప్ట్ చదివి, నచ్చి రవన్న పాత్ర చేయడం కోసం ముందుకొచ్చారు. నందితాదాస్, ప్రియమణి, ఈశ్వరీరావు ... వీళ్లందరినీ తెరపై చూసి ఎంతో ఆరాధించాను. వాళ్లతో కలిసి నటిస్తున్నప్పుడు భయపడలేదు కానీ, తెరపై చూసుకున్నాక థ్రిల్‌కి గురయ్యాను. డానీ, దివాకర్ మణి కెమెరా పనితనం ఒక కవిత్వంలాగే ఉంటుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అదే స్థాయిలో అలరిస్తుంది.
సాయిపల్లవి కోసమే రాసిన కథ ఇదని చెబుతుంటారు దర్శకులు. మీకంటూ ఓ ఇమేజ్ ఏర్పడింది. దీనిపై మీ అభిప్రాయమేమిటి?
నా కోసమే కథలు రాసుకుంటున్నారంటే అది ఆనందమే కదా. ఇక ఇమేజ్ అంటారా? స్టార్‌డమ్, ఇమేజ్‌లాంటి ఒత్తిళ్లు పెట్టుకోకుండా నటిస్తున్నా. మంచి కథలు, గౌరవప్రదమైన పాత్రల్లో భాగం కావడంపైనే ఉంటుంది నా దృష్టంతా.