Ram Charan Paris Tour :తన సతీమణి ఉపాసనతో పారిస్ వెళ్లిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా అక్కడ జరిగిన ఓ సన్నిహితుల వివాహానికి హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఉపాసన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలో నూతన వధూవరులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. "ప్రియమైన రోజ్మిన్.. నీకు శుభాకాంక్షలు.. పారిస్‌లో మీతో మేము మరింత సరదాగా గడిపాము" అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
చూడముచ్చటగా ఉన్న ఆ ఫొటోల్లో చెర్రీ అవుట్‌ఫిట్ అందరి దృష్టిని ఆకర్షించింది. లేత గోధుమ రంగు వర్ణంలో ఉన్న ఆ సూట్లో చెర్రీ ఎంతో బాగున్నారంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు రీసెంట్గా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవలే ఆ చిన్నారికి క్లీంకార అని నామకరణం చేశారు.
Ram Charan Movies : ప్రస్తుతం చెర్రీ.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్, జయరాయ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.