రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం మరో షెడ్యూల్ షూటింగ్ రేపటి నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానుందని దానికోసం రామ్ చరణ్ ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారని సమాచారం.
ఆరు రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ఫ్లాష్‌బ్యాక్ సీన్లు చిత్రీకరించనున్నారట. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌గా వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ నటించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పైన ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో అంజలి, జయరామ్, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
'మాన్‌స్టర్'గా మారిన మోహన్‌లాల్..
మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మాన్‌స్టర్'. ఈ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదలైంది. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లెజెండరీ నటుడు మోహన్‌లాల్ ఈ సినిమాలో లక్కీ సింగ్ అనే పాత్రలో నటిస్తున్నారు. సుమారు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ట్రైలర్ సస్పెన్స్‌తో కూడి ఉంది. ఒక మిస్సింగ్ కేసు చూట్టూ ఈ కథ తిరుగుతుందని అర్థమవుతోంది.
మోహాన్‌లాల్ నటించిన ఈ సినిమాపై అటు సినీ ప్రియులు, ఇటు సూపర్ స్టార్ మోహాన్‌లాల్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు వైశాఖ్ దర్శకత్వం వహిస్తుండగా దీపక్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఇక హనీ రోజ్, సుదేవ్ నాయర్, గణేష్ కుమార్ నటిస్తున్న ఈ సినిమాలో తెలుగు నటి మంచు లక్ష్మి కీలకపాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం మోహన్‌లాల్ ఈ సినిమాతో పాటు 'రామ్' సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న 'రామ్'లో త్రిష, సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు.