చాలామందిలాగే బాలయ్యబాబు అంటే తానూ మొదట్లో భయపడ్డానని, కానీ తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నానని నటి ప్రగ్యా జైస్వాల్ చెప్పింది. నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో 'అఖండ' తెరకెక్కుతోంది. మెజారిటీభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ కనిపించనుంది. ఆఖరి షెడ్యూల్ కోసం ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.
"ఈ సినిమాకు సంతకం చేయకముందే బాలకృష్ణగారి గురించి చాలా విన్నాను. అందుకే ఆయనతో సినిమా చేయాలంటే భయం వేసింది. సినిమా చిత్రీకరణ మొదలైనప్పుడు కూడా ఆయనను చూస్తే భయపడేదాన్ని. ఒకసారి సెట్‌లో ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఎంత సరదాగా ఉంటారో అర్థమైంది. ఆయన గురించి బయట వినిపించే వార్తలకు బాలకృష్ణ చాలా భిన్నంగా ఉంటారు. ఎప్పుడు చూసినా ఉత్సాహంగా కనిపిస్తారు. ఆయన సెట్లో ఉంటే అక్కడ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది" అని ప్రగ్యా చెప్పుకొచ్చింది.
బాలకృష్ణ-బోయపాటి కలయికలో వచ్చిన సినిమాల్లో హీరోయిన్లకు తగిన ప్రాధాన్యం ఉండదన్న వార్తలపై ఆమె స్పందిస్తూ.. "గత సినిమాల గురించి మాకు సంబంధం లేదు. ఈ సినిమాలో నా పాత్ర చాలా బలమైంది. నేను కేవలం ఒక అందాల ప్రదర్శన కోసం కాకుండా.. నటిగా నిరూపించుకునేందుకు ఈ సినిమా చేశాను. బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ బాలకృష్ణ-బోయపాటి చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నా. సినిమాలో నా లుక్, పాత్ర గురించి ఎవరూ రివీల్ చేయలేదు. ఈ చిత్రంలో నాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మీరు ఖచ్చితంగా ఈ సినిమాను ఆస్వాదిస్తారని భరోసా ఇస్తున్నాను" అని ప్రగ్యా మాట్లాడింది.
ప్రగ్యా 'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. డైరెక్టర్ క్రిష్ తెరెక్కించిన ఆ చిత్రం ఫిల్మ్‌ఫేర్ పురస్కారం అందుకుంది. సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఆ తర్వాత 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఓం నమో వెంకటేశాయ' వంటి పలు చిత్రాల్లో ఆమె నటించింది. రెండేళ్ల తర్వాత 'అఖండ' ఆమె మళ్లీ తెలుగులోకి పునరాగమనం చేయబోతోంది. హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తోందామె.