ప్రేక్షకుడు కొత్త కథల్నే కాదు.. తెరపై ఎప్పుడూ చూడని హంగుల్నీ కోరుకుంటున్నాడు. అందుకే సినీ రూపకర్తలు లార్జర్ దేన్ లైఫ్ స్థాయి సినిమాల్ని రూపొందించడంపై దృష్టిపెట్టారు. అవసరమైతే ఆ చిత్రాల కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించి, అందులో చిత్రీకరణ చేస్తున్నారు. మారిన ప్రేక్షకుడి అభిరుచులు.. దర్శకులు సిద్ధం చేస్తున్న కథల స్థాయే దీనికి కారణం. ఇదివరకు ఓ పెద్ద కథ రాయాలంటే నిర్మాణ వ్యయం గుర్తొచ్చి ఆగిపోయేవాళ్లు దర్శకులు, రచయితలు. ఇప్పుడు మన సినిమా మార్కెట్ స్థాయి పెరగడంతో, కథలు ఏం కోరుకుంటే అది, ఎంత కోరుకుంటే అంత వ్యయం చేయడానికి వెనకాడటం లేదు నిర్మాతలు.
బడ్జెట్ విషయంలో నిర్మాతలు తగ్గేదేలే.. పాటకే రూ.15 కోట్లు.. మోడల్ కార్ల తయారీ - ఆర్సీ 15 సినిమా సాంగ్ షూటింగ్
సినీ ప్రేక్షకులను అలరించేందుకు నిర్మాతలు ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. తాజాగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' సినిమాలో చూపించాల్సిన కొన్ని వాహనాల కోసం దర్శకుడు నాగ్‌అశ్విన్ ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మహీంద్రాని ఆశ్రయించారు. అలాగే రామ్‌చరణ్-శంకర్ కలయికలో వస్తున్న సినిమాలో ఒక పాట కోసమే రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగులో నిత్యం ఒకట్రెండు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మాణంలో ఉంటున్నాయంటే కారణం అదే! ప్రస్తుతం పవన్‌కల్యాణ్ 'హరిహర వీరమల్లు'తోపాటు, ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె', రామ్‌చరణ్ - శంకర్‌ల చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 'హరిహర వీరమల్లు', 'ప్రాజెక్ట్ కె' ప్రత్యేక ప్రపంచంలో సాగే కథలు. అందుకు తగ్గట్టుగా ఆ వాతావరణాన్ని సృష్టించి చిత్రీకరణ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న 'ప్రాజెక్ట్ కె', రామ్‌చరణ్ - శంకర్ సినిమాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
'ప్రాజెక్ట్ కె' కోసం ప్రతిదీ కొత్తగా తయారు చేసుకోవాల్సిందేనని, ఆ కథ, ఆ ప్రపంచం అలాంటిదని ఇటీవల దర్శకుడు నాగ్‌అశ్విన్ తెలిపారు. ఈ సినిమాలో చూపించాల్సిన కొన్ని వాహనాల నిర్మాణం కోసం ఇదివరకు ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మహీంద్రాని ఆశ్రయించారు దర్శకుడు నాగ్‌అశ్విన్. ఇటీవల కెమికల్ ఇంజినీర్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ మేకప్ నిపుణుల సాయాన్ని కోరింది చిత్రబృందం. సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే తదితరులు నటిస్తున్నారు. రామ్‌చరణ్ - శంకర్ కలయికలో సినిమాకి సంబంధించి కూడా కొన్ని భారీ హంగుల సంగతులు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. త్వరలోనే న్యూజిలాండ్‌లో తెరకెక్కించనున్న ఓ పాట కోసమే రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.