ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'పొన్నియిన్ సెల్వన్ 2' చిత్రం.. అభిమానులను అలరిస్తోంది. ఓపెనింగ్స్ భారీగానే రాబట్టినా.. రిలీజ్ అయిన మూడు రోజుల తర్వాత నుంచి ఈ సినిమా కలెక్షన్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సొంతం చేసుకున్న 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1'కి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. కానీ 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1' వసూలు చేసినన్ని కలెక్షన్లను 'పొన్నియిన్ సెల్వన్ 2' అందుకోలేకపోతోంది. 'పొన్నియిన్ సెల్వన్' గతేడాది విజయవంతంగా ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. అయితే 'పొన్నియిన్ సెల్వన్ 2' దేశవ్యాప్తంగా ఆరో రోజైన బుధవారం కేవలం రూ.8 కోట్లు వసూలు చేసింది. విడుదల అయిన రోజు నుంచి మొదటిసారి సినిమా కలెక్షన్లు సింగిల్ డిజిట్‌కు పరిమితం అయ్యాయి. వరుసగా ఐదు రోజుల పాటు కలెక్షన్ల పరంగా దూసుకెళ్లిన సినిమా.. తాజాగా నెమ్మదించింది.
పొన్నియిన్ సెల్వన్-2 కలెక్షన్స్ డౌన్.. ఇప్పటివరకు ఎంత వచ్చిందంటే?
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా కలెక్షన్లు రోజు రోజుకు తగ్గుతున్నాయి. గడిచిన ఆరు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే?
అయితే ఈ వీకెండ్లో కలెక్షన్లు మళ్లీ ఊపందుకోవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.122.25 కోట్లు వసూలు చేసి, ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు చేరువలో ఉంది. ఈ కలెక్షన్లలో తమిళంలో 26.67 శాతం, మలయాళంలో 14.63 శాతం, తెలుగులో 12.59, హిందీలో 7.91 శాతం ఆడియోన్స్ షేర్ నమోదైందని ట్రేడ్ వర్గాల టాక్. వీకెండ్లో ఈ చిత్రం ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు రాబట్టింది. ఏకంగా 3.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 8వ స్థానంలో నిలిచిందని మద్రాస్ టాకీస్ ట్వీట్‌లో పేర్కొంది.
కాగా 9వ శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ కథను కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా రూపొందించారు. పలువురు దర్శకులు ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నించినప్పటికీ ఇది తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నంకే సాధ్యపడింది. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, త్రిష కృష్ణన్, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, విక్రమ్ లాంటి స్టార్స్ వారి వారి పాత్రల్లో అద్భుతంగా చేశారని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో రెండవ భాగం కూడా బాక్సాఫీస్ వద్ద అంతకంటే ఎక్కువగా వసూళ్లు చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.