Payal Rajput Mangalavaram Movie : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో తాజాగా తెరకెక్కిన మూవీ 'మంగళవారం'. మిస్టీరియస్ థ్రిల్లర్‌గా, లేడీ ఓరియెంటడ్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ భూపతి రూపొందించారు. ట్రైలర్‌తో భారీ అంచనాలు పెంచిన ఈ మూవీ నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో డైరెక్టర్ అజయ్ భూపతి తాజాగా విలేకర్లతో మాట్లాడారు. ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
- కథ, హీరోయిన్ పాత్ర చిత్రీకరణలో కాంటెంపరరీ పాయింట్ ఉంటుంది. ఈ మూవీని చూసి ప్రేక్షకులు తప్పకుండా షాక్ అవుతారు. గ్రామీణ నేపథ్యంలోసాగే ఓ మిస్టీరియస్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాను సుమారు 100 రోజులకు పైగా షూట్ చేశాం. అందులో ఎక్కువశాతం నైట్ షూట్స్ మాత్రమే చేశాను. ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. ప్రేక్షకులను ఏమాత్రం గందరగోళానికి గురి చేయకుండా విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో దీనిని తీర్చిదిద్దాను. ఇందులో పాయల్ రాజ్‌పుత్ పాత్ర కొత్తగా ఉండనుంది. తను ప్రాణం పెట్టి మరీ నటించింది. ఆమె నటన చూసి ప్రేక్షకులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు.
- ఇక ఈ సినిమాలో మ్యూజిక్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. 'కాంతర' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించాడు. 'కాంతార'కు అజనీష్ అందించిన మ్యూజిక్ నాకెంతో నచ్చింది. అందుకే ఆయన్ను సంప్రదించాను. ఈ చిత్రానికి ఆయన మంచి సంగీతం ఇచ్చారు. ముఖ్యంగా 'గణగణ మోగాలి' పాటకు కచ్చితంగా పూనకాలు వచ్చేస్తాయి.
- ఎలాంటి అంచనాలు, అపోహలు లేకుండా ఓపెన్ మైండ్‌తో ఈ సినిమా చూడటానికి రండి. మీరు షాకయ్యే అంశాలు ఇందులో చాలానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చూస్తే ఎన్నో ప్రశ్నలు మెదులుతాయి. సెకండాఫ్‌లో వాటన్నింటిని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తుంటే ఆడియెన్స్ షాక్ అవుతారు. ఇక చివరి 45 నిమిషాలు ఎన్నో ట్విస్టులు ఉంటాయి. సీటు చివర్లో కూర్చోబెడుతుందీ సినిమా. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.
- ఏడాదిన్నర క్రితమే అల్లు అర్జున్ ఈ స్టోరీ విన్నారు. అది ఆయనకెంతో నచ్చింది. సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు కూడా చెప్పారు. ఇటీవల టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక ఆయన మెచ్చుకున్నారు.