తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వెంకటేశ్​ ఆ లాజిక్​ను ఎందుకు మిస్​ అయ్యారో - ఎఫ్​ 3 సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ

విక్టరీ వెంకటేశ్​ గురించి మాట్లాడారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఎప్పుడూ పర్​ఫెక్ట్​గా ఉండే వెంకీ లాజిక్​ మిస్​ అయి ఓ పాత్రను అనవసరంగా ఒప్పుకున్నారని చెప్పారు. ఏంటంటే

venkatesh F3
వెంకటేశ్ ఎఫ్​ 3

By

Published : Aug 13, 2022, 12:43 PM IST

Venkatesh Paruchuri Gopalakrishna: దర్శకుడు అనిల్​రావిపూడి తెరకెక్కించిన ఎఫ్​ 3పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. 'ఎఫ్‌-2'తో పోలిస్తే 'ఎఫ్‌-3' అంత బాలేదని ఆయన తెలిపారు. గతంలో తాము చేసిన తప్పే ఇప్పుడు దర్శకుడు అనిల్‌ రావిపూడి చేశారా? అన్న అనుమానం తనకు కలిగిందని అన్నారు.

''ఒక్క ముక్కలో చెప్పాలంటే 'ఎఫ్‌-2' చూసిన కళ్లతో 'ఎఫ్‌-3' చూస్తే ఈ సినిమా అంత బాలేదనిపించింది. కలెక్షన్స్‌ పరంగా చూసుకున్నా.. ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు రాలేదనే అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకూ ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఒకవేళ ఇదే చిత్రం కనుక దాదాపు రూ.250 కోట్లు వసూళ్లు చేస్తే 'ఎఫ్‌-2'తో సమానమై ఉండేది. 'ఎఫ్‌-2' అంత విజయం సాధించడానికి కారణం అది అందరికీ ఆసక్తి ఉన్న అంశం. భార్యాభర్తలిద్దరిలో ఎవరి పెత్తనం ఇంట్లో కొనసాగాలి? అనే టాపిక్‌పై ఆ చిత్రాన్ని రూపొందించారు. మన ఇళ్లలో జరిగే చిన్న చిన్న గొడవలను చూపించారు. దానివల్ల ప్రతి ఒక్కరూ 'ఎఫ్‌-2'కి కనెక్ట్‌ అయిపోయారు. అందుకే ఆ సినిమా అందరి హృదయాలకు చేరువైంది. అనిల్‌ రావిపూడికి మంచి గుర్తింపు వచ్చేలా చేసింది. రైటర్‌, స్క్రీన్‌ప్లే, దర్శకుడిగా ఆయన విజయం సాధించాడు''

''ఇటీవల నేను 'ఎఫ్‌-3' చూశా. గతంలో 'శ్రీ కట్న లీలలు'లో మేము చేసిన పొరపాటే అనిల్‌ రావిపూడి ఈ సినిమాలోని సెకండాఫ్‌లో చేశారనే అనుమానం నాకు కలిగింది. ప్రాథమికంగా చూసుకుంటే సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ పట్టాలు తప్పింది. ఒక చీటింగ్‌ డ్రామాని దాదాపు 40 నిమిషాలు నడిపారు. చిన్నప్పుడు తప్పిపోయిన తన కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నానని, ఆ కొడుక్కి ఇప్పుడు సుమారు 20 ఏళ్లు ఉంటాయని మురళీ శర్మ ప్రకటించడం.. అది చూసి, డబ్బు కోసం తానే కొడుకునంటూ వెంకటేశ్‌ వెళ్లినట్టు సినిమాలో చూపించారు. వెంకీ వయసు మనందరికీ తెలుసు. ఆయన్ని ఇరవైయేళ్ల కొడుకు పాత్రలో చూపించడం అంతగా అతికినట్లు అనిపించలేదు. మేము వెంకీకి ఎన్నో సినిమాలు రాశాం. ఏ కాస్త లాజిక్‌ మిస్సైనా ఆయన అస్సలు ఒప్పుకోరు. అలాంటిది ఈ పాత్ర ఎలా ఓకే చేశారో అర్థం కావడం లేదు. అదే విధంగా తమన్నాకు మీసాలు పెట్టి ఒక అబ్బాయిలా చూపించడం, తాము కూడా కొడుకులమేనంటూ వెన్నెలకిషోర్‌, వరుణ్‌ తేజ్‌ అక్కడికి రావడం... ఇలా సెకండాఫ్‌లో వచ్చే సీన్స్‌ అన్నీ అర్థంపర్థం లేని కామెడీలా అనిపించాయి''

''సెకండాఫ్‌లోని 40 నిమిషాలు ఇలా కాకుండా వేరేలా చూపించి ఉండుంటే సినిమా మరోలా ఉండేదని నా భావన. సినిమా చివర్లో వరుణ్‌తేజే.. మురళీ శర్మ వారసుడని, వెంకీ, తమన్నా, రాజేంద్రప్రసాద్‌.. ఇతర పాత్రధారులందరూ చెబుతారు కదా. అదే సీన్‌ని మెయిన్‌ పాయింట్‌గా తీసుకుని వరుణ్‌ని మురళీ శర్మ వారసుడిగా నిరూపించేందుకు వాళ్లందరూ నానా తంటాలు పడుతున్నట్లు కనుక డ్రామా నడిపి ఉంటే బాగుండేదనిపించింది.''

''అలాగే డబ్బు ఉంటే సుఖంగా జీవించవచ్చు అనేది నిజం కాదు. ఇది ప్రాథమిక సూత్రం. కాబట్టి, డబ్బుంటేనే సంతోషంగా జీవించగలమని చూపించకుండా ఉండాల్సింది. సినిమా ప్రారంభంలో సునీల్‌ని కత్తితో పొడిచినట్లు చూపిస్తారు. కట్‌ చేస్తే ఫస్ట్‌ సాంగ్‌లో అతడు డ్యాన్స్‌ చేస్తూ ఉంటాడు. అదెలా సాధ్యం. తన కుటుంబం మొత్తం హోటల్‌ నడుపుకొంటూ ఉంటుంటే మెహ్రీన్‌ మాత్రం వేరే ఇంట్లో పనిమనిషిగా వర్క్‌ చేయడం కూడా అంతగా నప్పలేదు. ఎన్నో తప్పులున్నప్పటికీ ఈ సినిమా బతికిందంటే అది కేవలం చివరి 20 నిమిషాల వల్లే. హీరో అంటే ఏదైనా చేయగలడు అని నిరూపించాలి తప్ప.. అతడికి ఏం చేతకాదు అనిపించుకోకూడదు. చివరి 20 నిమిషాల్లో వరుణ్‌ తేజ్‌, వెంకటేశ్‌ పాత్రలను రియల్‌ హీరోలుగా దర్శకుడు చూపించాడు కాబట్టే ఆ సినిమా నిలబడిందని నా ఉద్దేశం. ఫైనల్‌గా 'ఎఫ్‌-2'లో మాదిరిగా ఈ సినిమాలో మనసుని హత్తుకునే డ్రామా లేదు'' అని పరుచూరి చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: రెండో పెళ్లిపై నటి సురేఖ క్లారిటీ.. అలాంటి బాయ్​ఫ్రెండ్​ కావాలంటూ..

ABOUT THE AUTHOR

...view details