Oscar Race 2024 Indian Movie :కేరళలో విధ్యంసం సృష్టించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ చిత్రం '2018 - ఎవ్రీ వన్ ఈజ్ హీరో' సినిమాకు ఓ అరుదైన గౌరవం దక్కింది. భారత్ తరఫున ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కోసం జరిగే నామినేషన్ ప్రకియలో భారత్ నుంచి ఈ సినిమా ఆస్కార్ రేసులోకి దిగింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది.
Oscars 2024 2018 Movie : '2018 - ఎవ్రీ వన్ ఈజ్ హీరో' మలయాళ యువ కథానాయకుడు టోవినో థామస్ కీలక పాత్రలో నటించారు. లాల్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, తన్వి రామ్, అపర్ణ బాల మురళి, కున్‌చకో బోబన్, అజు వర్గీస్, నరైన్, కలైయారసన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక్కరు అని కాకుండా... ప్రతి ఒక్కరిదీ కథలో కీలక పాత్రే. అందరూ అద్భుతంగా నటించారని చెప్పొచ్చు.
2018 సినిమా ఆస్కార్‌కు ఎంపికైన సందర్భంగా దర్శకుడు జోసెఫ్ ఈటీవీ భరత్‌తో మాట్లాడారు. " ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అస్కార్ గురించి అసలు ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆస్కార్ గురించి కలలు కంటున్నాను. మా సినిమా భారత్ నుంచి ఆస్కార్‌కి ఎంపికైనందుకు హ్యాపీగా ఉంది. ఈ గుర్తింపు మలయాళ చిత్ర పరిశ్రమ నిర్మాతలు, మలయాళీ ప్రేక్షకులకు అంకితం చేస్తున్నాను. అలాగే నాపై నమ్మకం ఉంచిన నిర్మాతలకు ధన్యవాదాలు" అని జోసెఫ్ అన్నారు.
ఈ చిత్రాన్ని 2018లో కేరళను ముంచెత్తిన వరదల నేపథ్యంలో తెరకెక్కించారు. మే 25న కేరళలో మలయాళ సినిమాగా విడుదల అయ్యింది. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి జాతీయ ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకుంది. కేరళలో వసూళ్ల ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాను మే 26న తెలుగులో బన్నీ వాసు విడుదల చేశారు. ఇప్పుడీ సినిమాను ఆస్కార్స్ 2024కి పంపిస్తుండటంతో కేరళ ప్రేక్షకులు, ఈ సినిమా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.