చిత్రం: దసరా; నటీనటులు: నాని, కీర్తిసురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయికుమార్, జరీనా వాహబ్ తదితరులు; సంగీతం: సంతోష్ నారాయణన్; సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్; ఎడిటింగ్: నవీన్ నూలి; నిర్మాత: సుధాకర్ చెరుకూరి; రచన: శ్రీకాంత్ ఓదెల, జెల్ల శ్రీనాథ్, అర్జున పాతూరి, వంశీ కృష్ణ; దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల; విడుదల: 30-03-2023
డిఫరెంట్ కాన్సెప్ట్స్ ను ఎంచుకుంటూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ఇలా అందరికి నాని సినిమాలు బాగా నచ్చుతాయి. అందుకు తగ్గట్టుగానే నాని కథల ఎంపిక ఉంటుంది. అలా తన నేచురల్ యాక్టింగ్‌తో వెందితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు ఈ నేచురల్ స్టార్.
అయితే, ఇప్పుడు శ్రీరామన వమికి 'దసరా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాని ఊరమాస్ లుక్‌లో దర్శనమివ్వడంతో పాటు, అతడికి జోడీగా కీర్తి సురేశ్ నటించడం.. టీజర్‌తో పాటు ట్రైలర్‌తో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను 'దసరా' అందుకుందా?. నాని ఏ మేరకు మెప్పించారు?
స్టోరీ ఏంటంటే..
తెలంగాణలోని సింగరేణి ప్రాంతంలో.. 1995లో వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ సాగే కథ ఇది. ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేశ్) ఈ ముగ్గురు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. తన స్నేహితుడు సూరి కోసం తన ప్రేమనే త్యాగం చేసినవాడు ధరణి. రైళ్లలో బొగ్గు దొంగతనం చేయడం.. తాగడం, స్నేహితులంతా కలసి తిరగడం ఇదే వాళ్లు రోజూ చేసే పని. ఇలా సాఫీగా సాగుతున్న వారి జీవితాలను ఆ ఊరి సర్పంచ్ ఎన్నికలు ఒక్కసారిగా కుదిపేస్తాయి. చిన్న నంబి (షైన్ టామ్ చాకో) పోటీ చేసిన ఆ ఎన్నికలకు సూరితో పాటు అతని స్నేహబృందం.. రాజన్న (సాయికుమార్)కి మద్దతుగా నిలిచి గెలిపించాక ఆ ఊళ్లో తీవ్ర సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆ పరిణామాలు ఎలాంటివి? ముగ్గురు స్నేహితుల జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చయనేది మిగతా కథ.
ఎలా ఉందంటే?
స్టోరీని బట్టి మనమైన మూలాల్లోకి వెళ్లి ఆ జీవితాల్ని, కథల్ని నేచురల్‌గా తెరపై కళ్లకు కట్టినట్టుగా చూపిస్తున్న ట్రెండ్ ఇది. ఇక 'దసరా' సినిమా కూడా తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని వీర్లపల్లి కథని, అందులోని కొన్ని జీవితాలను చూపిస్తుంది. ఈ కథ కంటే దీని నేపథ్యమే ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతుంది అని చెప్పొచ్చు. కొత్త కథేమీ కానప్పటికీ.. ఇందులో పాత్రలతో పాటు కొన్ని విషయాలు 'రంగస్థలం' మొదలుకొని ఇదివరకు వచ్చిన వివిధ సినిమాల్ని ఓ మేర తలపిస్తున్నాయి.
స్నేహం, ప్రేమ, త్యాగాల లాంటి మంచి భావోద్వేగాల్ని రాబట్టే ప్రయత్నం చేశారు దర్శకుడు శ్రీ కాంత్ ఓదెల. ఆ ఊరితో పాటు పెద్దల్ని, రాజకీయాల్ని పరిచయం చేస్తూ సాగే ఆరంభ సన్నివేశాలు అంతగా ప్రభావం చూపించకపోయినా... హీరో ఇంట్రడక్షన్ నుంచే కథలో వేగం పెరుగుతుంది. బొగ్గుని దొంగతనం చేసే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత క్రమంగా స్నేహాన్ని, ప్రేమను ఎస్టాబ్లిష్ చేస్తూ పట్టు ప్రదర్శించారు దర్శకుడు.
ఎన్నికల్లో చిన్ననంబి పోటీ.. యువకుల మధ్య క్రికెట్ పోటీలు పెట్టడం, బార్ అకౌంటెంట్ పోస్ట్, వెన్నెల పెళ్లి చుట్టూ సాగే సన్నివేశాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. సినిమాలో ఆ సన్నివేశాలన్నీ ఒక ఎత్తు అయితే.. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్స్ మరో ఎత్తు. సినిమాను మరో మలుపు తిప్పే ఆ ఎపిసోడ్.. ద్వితీయార్థంపై మరింత ఆసక్తిని పెంచుతుంది. అయితే రెండో భాగంలో ధరణి, వెన్నెల పాత్రల మధ్య మరింత డ్రామా, సంఘర్షణ పండించేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. ఆ సన్నివేశాలన్నింటిని ప్రతీకార కోణంలోనే మలిచారు దర్శకుడు.