Naa Saami Ranga Movie Review : కింగ్ నాగార్జునకు సంక్రాంతి బాగా అచ్చొచ్చిన సీజన్ అన్న సంగతి తెలిసిందే. 'బంగార్రాజు', 'సోగ్గాడే చిన్ని నాయన' వంటి హిట్ చిత్రాలన్నీ పండగ బరిలోనే వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సారి ముగ్గుల పండగకు 'నా సామిరంగ'తో వచ్చారు నాగ్. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ ఫేమ్ ఎం.ఎం.కీరవాణి సంగీతమందించారు. మరి ఇంతకీ ఈ 'నా సామిరంగ'కథేంటి? అది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చింది?
Naa Saami Ranga Review Story కథేంటంటే : కిష్టయ్య (నాగార్జున) ఓ అనాథ. అంజి (అల్లరి నరేశ్) తల్లి అతడిని పెంచుతుంది. దీంతో కిష్టయ్య - అంజి సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. అయితే తల్లి చనిపోయిన తర్వాత వారిద్దరికీ ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్) అండగా ఉంటాడు. అందుకే కిష్టయ్య పెద్దయ్య మాట దాటి ఏమీ చేయడు. అయితే కిష్టయ్య 12ఏళ్ల వయసులోనే వరాలుతో(ఆషికా రంగనాథ్) ప్రేమ కథ నడిపిస్తాడు. కానీ చిన్నతనంలోనే చదువుల కోసం సిటీకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మళ్లీ 15 ఏళ్లకు తిరిగి వస్తుంది. దీంతో ఇద్దరి మళ్లీ ప్రేమ మొదలవుతుంది.
అయితే ఓ వైపు తన ప్రేమ గురించి పెద్దయ్యకు చెప్పేందుకు వరాలును తీసుకొని ఇంటికి వెళ్తాడు కిష్టయ్య. సరిగ్గా అదే సమయంలో వరాలు తండ్రి వరదరాజులు (రావు రమేశ్) తన కూతుర్ని పెద్దయ్య కుమారుడు దాసు (షబ్బీర్)కు ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం కుదుర్చుకుంటాడు. కానీ కిష్టయ్య - వరాలు ప్రేమను అర్థం చేసుకున్న పెద్దయ్య వరదరాజులతో సంబంధాన్ని వదులుకుంటాడు. కానీ, తన కూతుర్ని కిష్టయ్యకు ఇచ్చి పెళ్లి చేయడానికి వరదరాజులు అంగీకరించడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? ఆ తర్వాత దాసు ఏం చేశాడు? అతడు అసలు అంజిపైనా పగ పెంచుకోవడానికి కారణమేంటి? కిష్టయ్య - అంజిని చంపేందుకు వేసిన ప్లాన్ పని చేసిందా? ఈ స్టోరీలో భాస్కర్ (రాజ్‌తరుణ్) - కుమారి (రుక్సార్)ల లవస్టోరీతో ఏర్పడ్డ సంఘర్షణ ఏంటి? వీరిద్దరిని కలపాలని కిష్టయ్య - అంజి చేసిన ప్రయత్నాలు ఫలించాయా? అనేదే కథ.