Nagarjuna About Oke Oka Jeevitham : అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున భావోద్వేగానికి గురయ్యారు. శర్వానంద్, అమల ప్రధాన పాత్రల్లో నటించిన 'ఒకే ఒక జీవితం' చూసి ఆయన థియేటర్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లిని గుర్తు చేసుకున్నట్లు చెప్పారు. "ఒకే ఒక జీవితం భావోద్వేగభరితమైన చిత్రం. అందంగా తీర్చిదిద్దారు. తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈసినిమా చూస్తే ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు కన్నీళ్లు ఆగలేదు. మా అమ్మ, ఆమె చూపించిన ప్రేమ గుర్తుకువచ్చింది. ఎమోషనల్‌గా అనిపించింది" అని నాగార్జున చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
టైమ్ ట్రావెల్, మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే చిత్రం 'ఒకే ఒక జీవితం'. శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమల, శర్వానంద్ తల్లీకొడుకులుగా నటించారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం బుధవారం 'ఒకే ఒక జీవితం' ప్రీమియర్ ప్రదర్శించారు. సినిమా చూసిన నాగార్జున చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఇక, ఈ సినిమాతో దాదాపు పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి నిడివి ఉన్న పాత్రలో అమల నటిస్తున్నారు. రీతూవర్మ కథానాయిక. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇదే చిత్రాన్ని తమిళంలో 'కణం' పేరుతో విడుదల చేయనున్నారు.