వేసవి సినీ మారథాన్ ముగిసింది. అగ్రతారల మెరుపులతో సినీ సీమ కొత్త సొబగులద్దుకుంది. ఇక ఇప్పుడు యువ హీరోల వంతు. వేసవి జోష్‌ని కొనసాగిస్తూ.. వినోదాల జల్లుల్లో తడిపేందుకు సిద్ధమవుతున్నారు కుర్ర కథానాయకులు. ఈ వానాకాలంలో పసందైన వినోదాల్ని వేడి వేడిగా వడ్డించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో నెలల వ్యవధిలో వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్న యువ హీరోలూ ఉన్నారు. మరి వారెవరు? ఆ చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి.
కార్తి.. ముచ్చటగా మూడు
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో జోరు చూపిస్తుంటారు కథానాయకుడు కార్తి. ప్రస్తుతం ఆయన 'విరుమన్', 'పొన్నియిన్ సెల్వన్', 'సర్దార్' సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మూడు చిత్రాలు వరుస నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో తొలుత బాక్సాఫీస్ ముందుకు రానున్న చిత్రం 'విరుమన్'. ఎం.ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 31న విడుదల కానుంది. తర్వాత నెల రోజులకే 'పొన్నియిన్ సెల్వన్'తో వినోదాలు పంచనున్నారు. మణిరత్నం తెరకెక్కించిన భారీ పీరియాడికల్ చిత్రమిది. చోళుల కాలం నాటి చారిత్రక కథాంశంతో రూపొందిన ఈ సినిమా.. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక కార్తి - పి.ఎస్.మిత్రన్ కలయికలో రూపొందిన సినిమా 'సర్దార్'. రాశి ఖన్నా కథానాయిక. సరికొత్త స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చైతూ.. డబుల్ ట్రీట్
గతేడాది 'లవ్‌స్టోరీ'తో భారీ విజయాన్ని అందుకున్న నాగచైతన్య తర్వాత తెలుగులో 'థ్యాంక్ యూ', హిందీలో 'లాల్ సింగ్ చద్దా' సినిమాల్లో నటించారు. ఇప్పుడీ రెండు సినిమాలు ఒకదాని వెంట మరొకటి బాక్సాఫీస్ ముందుకు వరుస కట్టనున్నాయి. అయితే వీటిలో ముందుగా ప్రేక్షకుల్ని పలకరించనున్న చిత్రం 'థ్యాంక్ యూ'నే. 'మనం' వంటి హిట్ తర్వాత చైతన్య - విక్రమ్.కె.కుమార్ కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రమిది. దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ కథానాయికలు. వినూత్నమైన ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చైతూ మూడు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనుండటం విశేషం. ఇది విడుదలైన మరుసటి నెలలోనే ఆగస్ట్ 11న 'లాల్ సింగ్ చద్దా'తో మరోమారు సినీప్రియుల ముందుకు రానున్నారు చైతన్య. ఇది ఆయన నటించిన తొలి బాలీవుడ్ సినిమా. ఆమీర్‌ఖాన్ హీరోగా నటించారు.హాలీవుడ్‌లో విజయవంతమైన 'ఫారెస్ట్ గంప్'నకు రీమేక్‌గా రూపొందింది. ఇందులో ఆమిర్ స్నేహితుడిగా బాలా అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు చైతూ. ట్రైలర్ ప్రచార చిత్రంలో యుద్ధ నేపథ్యంలో ఆమిర్, చైతన్య మధ్య వచ్చిన సన్నివేశాలు హత్తుకునేలా ఉన్నాయి.