Chiranjeevi mothers day special video: మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని భూమ్మీద ఉన్న తల్లులందరికీ శుభాకాంక్షలు తెలిపారు అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. తన అమ్మ అంజనాదేవి, సోదరులు పవన్‌కల్యాణ్, నాగబాబులతో కలిసి ఉన్న ఓ స్పెషల్ వీడియోని ఆయన ఆదివారం షేర్ చేశారు. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న 'గాడ్‌ఫాదర్', పవన్ హీరోగా నటించిన 'భీమ్లానాయక్'ల చిత్రీకరణ గతంలో ఓసారి హైదరాబాద్‌లోని ఒకే ప్రాంతంలో జరిగింది. ఎప్పుడూ బిజీగా ఉండే చిరు-పవన్ ఇద్దరూ ఒకే చోట ఉండటంతో అంజనాదేవి, నాగబాబు లొకేషన్‌కి చేరుకుని, సెట్‌లో కాసేపు సమయాన్ని గడిపారు. అందరూ కలిసి సెట్‌లోనే భోజనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోని చిరు షేర్ చేయగా.. సెలబ్రిటీలందరూ హ్యాపీ మదర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. చిరంజీవితోపాటు రకుల్‌ప్రీత్ సింగ్, అడివి శేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, సుధీర్‌బాబు, మోహన్‌లాల్.. ఇలా తారలందరూ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Sohel Mr.Preganant glimpse: 'కథవేరే ఉంటది.. నేను గిట్లనే ఉంట..'’ అంటూ ఓ ప్రముఖ రియాల్టీ షోలో పాల్గొని అందరి మన్ననలు అందుకున్నారు నటుడు సోహెల్. సినిమాపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన రియాల్టీ షో తర్వాత విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కథానాయకుడిగా మిస్టర్ ప్రెగ్నెంట్ అనే ఓ సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. తాజాగా నేడు మాతృదినోత్సవం సందర్భంగా ఆ సినిమాకి సంబంధించిన ఓ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది మూవీటీమ్. ఈ వీడియో ఆద్యంతం హృదయాన్ని తాకేలా ఉంది. "9 నెలల కష్టాన్ని.. నవ్వుతూ భరిస్తూ ఒక బిడ్డన్ని జన్మనివ్వడం, అది చావుని తెగించి.. ఈ ఆడవాళ్లు గ్రేట్" అంటూ సోహెల్ చెప్పిన డైలాగ్ మనసుని హత్తుకుంటూ ఆలోచింపజేసేలా ఉంది. శ్రీనివాస్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. సుహాసిని, బ్రహ్మజీ, రాజా రవీంద్ర, తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Nani Antey Sundaraniki song: నేచురల్ స్టార్ హీరో నాని, నజ్రియా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'అంటే సుందరానికి!'. ఇందులో సుందర్ ప్రసాద్ అనే పాత్రలో నటిస్తున్నారు నాని. బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఎంత చిత్రం సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఫుల్ సాంగ్ ను మే 9న సాయంత్రం 6:03 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, కీర్తన అలపించగా... రామజోగయ్య శాస్ర్తీ సాహిత్యం అందించారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 2022 జూన్ 10న ఈ సినిమా విడుదల కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.