తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కీరవాణికి 'కార్పెంటర్'​ స్పెషల్​ విషెస్​.. కూతుళ్లతో పాట పాడుతూ.. - కీరవాణి రిచర్డ్​ కార్పెంటర్​

ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ సాధించిన సంగీత దర్శకుడు కీరవాణికి అమెరికా దిగ్గజ సంగీతకారుడు, గాయకుడు రిచర్డ్‌ కార్పెంటర్‌ నుంచి ప్రశంసలు లభించాయి. చిన్నప్పుడు కార్పెంటర్ సంగీతం వింటూ పెరిగానని.. ఆస్కార్‌ వేదికపై కీరవాణి చెప్పారు. కార్పెంటర్‌ పాట 'టాప్ ఆఫ్‌ ద వరల్డ్‌'ను కాస్త మార్చి అదే వేదికపైనా ఆలపించారు. బదులుగా కార్పెంటర్ అదే పాటను కూతుళ్లతో పాడి కీరవాణి విజయాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.

Etv keeravani
Etv keeravani

By

Published : Mar 15, 2023, 6:41 PM IST

నాటు నాటు పాటకు ఆస్కార్‌ను ఒడిసి పట్టిన ఎంఎం కీరవాణి.. తన చిన్నప్పటి ఆరాధ్య సంగీత కళాకారుడు, గాయకుడు రిచర్డ్‌ కార్పెంటర్‌ నుంచి గొప్ప కితాబు అందుకున్నారు. లాస్‌ఏంజెలెస్‌లో ఆస్కార్‌ వేదికపై అవార్డు తీసుకున్న తర్వాత కీరవాణి తన ఆరాధ్య గాయకుడు కార్పెంటర్ ప్రస్తావన తెచ్చారు. తాను చిన్నప్పటి నుంచి కార్పెంటర్ సంగీతం వింటూ పెరిగి ఇప్పుడు ఆస్కార్‌ను సాధించానని చెప్పారు. కార్పెంటర్‌కు ఎంతో గుర్తింపు తెచ్చిన 'టాప్‌ ఆఫ్‌ ద వరల్డ్‌' పాటను కాస్త మార్చి ఆస్కార్ వేదికపైనే కీరవాణి పాడారు.

ఆస్కార్‌ వేదికపై తన ప్రస్తావన తెచ్చి తనపై అభిమానం చాటుకున్న కీరవాణికి రిచర్డ్‌ కార్పెంటర్‌ కూడా తనదైన శైలిలో బహుమతి పంపారు. తన టాప్ ఆఫ్‌ ద వరల్డ్ పాటనే కాస్త మార్చి తన ఇద్దరు కూతుళ్లు మండి, ట్రాకీలతో కలిసి పాడారు. 'మీ విజయం వల్లే మనం ప్రపంచపు అగ్రభాగాన ఉన్నాం అందుకు మేము ఎంత గర్వపడుతున్నామో నీకు కూడా తెలుసని అనుకుంటున్నాం' అంటూ పాటను మొదలు పెట్టి.. 'మీ విజయం మమ్మల్ని ప్రపంచపు అగ్రభాగాన నిలిపిందంటూ' ముగించారు. ఆ వీడియోను ట్వీట్‌ చేస్తూ.. 'మా కుటుంబం నుంచి చిన్న బహుమతి' అంటూ కీరవాణికి అభినందన తెలిపారు.

అమెరికా సంగీత ప్రపంచంలో రిచర్డ్ కార్పెంటర్ దిగ్గజ కళాకారుడు. 70వ దశకంలో తన సోదరి కరెన్‌ అన్నె కార్పెంటర్‌తో కలిసి.. ఎన్నో అద్భుతమైన పాటలు, ప్రదర్శనలు ఇచ్చిన ఆయన ఆమె మృతి తర్వాత ఒంటరిగానే అనేక ఆల్బమ్‌లు విడుదల చేశారు. అమెరికా సహా అనేక దేశాల సంగీత ప్రియులకు కార్పెంటర్‌ సుపరిచితుడు.

మరోవైపు, యావత్‌ సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన నాటు నాటు పాటను ప్రముఖ వీణ ఆర్టిస్ట్‌ శ్రీవాణి.. వీణపై ఆ గీతాన్ని ప్లే చేసి, ఆర్‌ఆర్‌ఆర్‌ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకు అకాడమీ అవార్డ్ అందుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా, తొలి భారతీయ సినిమా పాటగా నాటు నాటు చరిత్ర సృష్టించింది. మన దేశానికి వచ్చిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. ఇప్పటి వరకు భారతీయులు అందుకున్న ఆస్కార్ అవార్డులు అన్నీ హాలీవుడ్ సినిమాలు ద్వారా వచ్చినవే. లెజెండరీ దర్శకుడు సత్యజిత్ రేకు గౌరవ ఆస్కార్ ఇచ్చారు. ఇంతకు ముందు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన జయహో పాటకు ఆస్కార్ వచ్చింది. అయితే అది ఇండియన్ సినిమాలో పాట కాదు. హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించిన ఇంగ్లీష్ సినిమా స్లమ్ డాగ్ మిలినియర్​లోనిది.

ABOUT THE AUTHOR

...view details