కైకాల సత్యనారాయణ మరణం పట్ల సంతాపం ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన మరణం తనని ఎంతగానో కలచివేసిందన్నారు. నటన, రుచికరమైన భోజనం.. ఈ రెండూ ఆయనకు ప్రాణమని చెప్పారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
"తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణం నన్ను ఎంతగానో కలచివేస్తోంది. తెలుగు సినీ రంగానికే కాదు.. భారత చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటుడాయన. ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో మరో నటుడు పోషించి ఉండరు. ఆయనతో నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. అలా ఆయన వ్యక్తిత్వాన్నిదగ్గర నుంచి పరిశీలించే అవకాశం నాకు దక్కింది. డైలాగులు చెప్పడంలో ఆయనది ప్రత్యేక పంథా. నిష్కల్మషమైన మనసున్న మనిషి. ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు. నన్ను 'తమ్ముడు' అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.
నటన, రుచికరమైన భోజనం రెండూ ఆయనకు ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతి వంటను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారు. గతేడాది, ఈ ఏడాది ఆయన జన్మదినం సందర్భంగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిలిగిన సంతృప్తి. అప్పుడు ఆయన సురేఖతో.. ''అమ్మా.. ఉప్పు చేప వండి పంపించు'' అని అన్నప్పుడు.. ''మీరు త్వరగా కోలుకోండి ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం'' అని చెప్పాం. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోషపడ్డారు.