Mahesh Babu Flop Movie : సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలీవుడ్లో ఎంత పెద్ద హీరోనో తెలిసిన విషయమే. ప్రతీ సినిమాకు నటనను మెరుగుపరుచుకుంటూ కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగారు. అయితే ఎంతటి స్టార్ యాక్టర్ అయినా సరే.. కథలు, పాత్రలు, సినిమాలు, వాటి రిజల్ట్ విషయంలో ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయం గురించి మాట్లాడారు మహేశ్‌బాబు. స్టార్ అయితే ఒత్తిడిని అంగీకరించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మహేశ్-నమ్రత దంపతులు హాజరై సందడి చేశారు. అక్కడే మహేశ్.. తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను మాట్లాడారు. తన తండ్రి దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణను గుర్తుచేసుకున్నారు.
"నేను నటించిన చిత్రాలు ఫెయిల్ అయినప్పుడు నిరుత్సాహ పడతాను. ఎందుకంటే ఒక చిత్రంపై ఎన్నో అంచనాలు ఉంటాయి. దాని వెనక ఎంతో మంది కష్టం దాగి ఉంటుంది. దాని పూర్తి రెస్పాన్సిబులిటీ నేనే తీసుకుంటాను. అలాగే తర్వాతి చిత్రం ఎక్కువ ఫోకస్ చేస్తాను. మనం స్టార్ హీరో అయితే ఒత్తిడిని అంగీకరించాల్సిందే. ఈ విషయం నేను మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన నాకు చెప్పేవారు. క్రమశిక్షణ, వినయం.. వంటి వాటి ప్రాముఖ్యత గురించి కూడా నేర్పించారు. విజయం ఒక్కసారిగా రాదు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటేగానీ వస్తుందని అన్నారు." అంటూ మహేశ్ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు.
Mahesh Trivikram Movie : ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు. 'అతడు', 'ఖలేజా' తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రానున్న చిత్రమిది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమాలో మహేశ్‌కు జోడీగా హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.