రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం మొయినాబాద్‌లోని కృష్ణంరాజు ఫామ్ హౌస్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. హీరో ప్రభాస్ సోదరుడు చేతులమీదుగా ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి.
అయితే 56 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న కృష్ణంరాజు ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు. కథానాయకుడిగా పరిచయమై.. ఆ తర్వాత పరాజయాల్ని ఎదుర్కొని, ప్రతినాయకుడిగా.. సహాయ నటుడిగా ప్రయాణం సాగిస్తూ మళ్లీ హీరోగా తనని తాను ఆవిష్కరించుకున్న స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఆయన సొంతం. అయితే ఆయన ఇకలేరన్న వార్త అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆయన్ను ఇంకా స్మరించుకుంటూ సోషల్‌మీడియాలో ఆయనకు సంబంధించిన విషయాలను గుర్తుచేసుకుంటున్నారు.