KGF 2 Yash mother Archana: కనీసం ఇంజినీరింగ్ పట్టాలేకపోతే కష్టమే అనుకొనే ఈ రోజుల్లో... నాట్యం కోసం చదువుని పక్కన పెట్టేవాళ్లు ఎంత మంది ఉంటారు? అర్చనా జాయిస్ ఆ ధైర్యం చేసింది. నాట్యాన్నే నమ్ముకొన్న ఆ అమ్మాయికి నటనలో భావాలని అలవోకగా పలికించడం కష్టం కాలేదు. 21 ఏళ్లకే కేజీఎఫ్ చిత్రంలో రాకీభాయ్ అమ్మగా దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులని సంపాదించుకుంది. కాగా, అప్పుడు హీరో యశ్ వయసు 30. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చన.. తన గురించి కొన్ని ఆసక్తికర సంగతులను తెలిపింది. ఆ వివరాలివీ..
నటనలో నా అనుభవం తక్కువే. అయినా ఇంతమంది అభిమానులని సంపాదించుకున్నానంటే దానికి కారణం.. నేను అమితంగా ప్రేమించిన నాట్యం, దాన్ని నేర్చుకొనే అవకాశం ఇచ్చిన అమ్మానాన్నలే! నాన్న శ్రీనివాసన్‌ది హసన జిల్లా, అమ్మ వీణది కోలార జిల్లా. ఇద్దరూ ప్రైవేటు టీచర్లు. చిన్నప్పటి నుంచీ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని మాకిచ్చారు. నన్నూ, చెల్లెలు వైష్ణవిని బలవంతపు చదువుల వైపు మళ్లించలేదు. నాక్కూడా ఉదయం 8గంటలకు బడికి వెళ్లి, సాయంత్రం వరకు ఉండి... మళ్లీ రాత్రి దాకా ట్యూషన్లు... ఇలా ఇష్టం లేదు. బలవంతంగా చదివే చదువు ఒంటబట్టదని నాన్న అనే వారు. దాంతో నా దృష్టి నాకిష్టమైన సంగీతం, నాట్యంపై పడింది. అవి నేర్చుకుంటూనే కోలారలో మా మేనమామ ప్రారంభించిన బడిలో పదోతరగతి వరకూ చదువుకున్నా. బెంగళూరులో ఇంటర్ చేశా. తర్వాత డిగ్రీ చేయాలా... నాట్యం వైపు వెళ్లాలా? అనేది నా నిర్ణయానికే వదిలేశారు అమ్మానాన్న.
నృత్యంలో ప్రవేశం..మొదట్లో నాకు సంగీతమంటే ఇష్టం. చెల్లికి నృత్యమంటే ప్రాణం. తన ఇన్‌స్టిట్యూట్‌కి తోడుగా వెళ్తూ నేనూ నాట్యంతో ప్రేమలో పడ్డా. అలా ఆరో తరగతి నుంచే నృత్యంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించా. ఇంటర్ అయ్యేనాటికి వందకు పైగా ప్రదర్శనలివ్వడంతో కాలేజీలో నాకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. మామూలు డిగ్రీ చదివితే చిన్నతనం నుంచీ ప్రేమించిన నాట్యానికి దూరమవుతాననిపించింది. దాంతో బెంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన నాట్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీలో మూడేళ్ల బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరిపోయా. భరతనాట్యంలో పట్టా పొందా. ఈ క్రమంలో విదేశాల్లోనూ ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చాను.