Keerthi suresh Sarkaru vaaripata movie: "నటిగా నాకు ఇది పండగ తరహా సమయం" అంటోంది కీర్తిసురేష్. చిత్రసీమలో అవకాశమే కీలకమని, అది వచ్చాక మనం ఏం చేయగలమో అవన్నీ చూపించాల్సిందే అంటోందామె. 'సర్కారు వారి పాట' సినిమాతో కీర్తిసురేష్‌లో మరో కోణాన్ని చూస్తారని చెబుతోంది. ఆ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో చిత్ర విశేషాలను గురించి తెలిపింది. ఆ విషయాలివీ..
"కళావతి పాత్ర నాకు నిజంగానే ఓ పెద్ద బహుమతి. ఇలాంటి పాత్రలు తెలుగులో ఇంతకు ముందు చేయలేదు. నాటీగా కనిపిస్తూ నవ్వించే ఓ వైవిధ్యమైన పాత్ర. నేను తెరపైన కనిపించే సమయమూ ఎక్కువే. ఓ వాణిజ్య సినిమాలో ఇంత ప్రాధాన్యమున్న పాత్ర రావడం అరుదు కదా. తెలుగులో నేను చేసిన సినిమాలూ తక్కువే. 'మహానటి' నా నాలుగో చిత్రం. తమిళంలోనే ఎక్కువ చేశాను. 'మహానటి' తర్వాత నాకు వాణిజ్య ప్రధానమైన సినిమా రావడానికి కొంచెం సమయం పట్టింది. అంతకుముందు 'అజ్ఞాతవాసి' చేశాను కానీ, అందులో ఇలాంటి మాస్ పాత్ర కాదు. ఈ పాత్ర కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది’’.
"మహేష్, నేను కలిసి నటించడం ఇదే తొలిసారి. ఆయన ఇలాంటి ఓ మాస్ పాత్ర చేసి చాలా రోజులైంది. వాణిజ్య సినిమాల్లో లవ్‌ట్రాక్ అనేది ఎప్పుడూ విడిగానే ఉంటుంది. ఇందులో కథలో భాగంగానే ఉంటుంది. ప్రేక్షకుల్ని ఏడిపించడం, నవ్వించడం అంత సులభం కాదు. పైగా ఇందులో నా పాత్రకి సంభాషణలు ఓ ప్రత్యేకమైన యాసలో రాశారు దర్శకుడు".