'అభిమన్యుడు', 'హీరో' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్. ఈ రెండు సినిమాలతో కోలీవుడ్, టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ఆయన ఇప్పుడు 'సర్దార్'తో రాబోతున్నారు. కార్తి హీరోగా మిత్రన్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మిత్రన్ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
'సర్దార్' ఎలా మొదలైంది?
మిత్రన్: నా తొలి చిత్రం 'అభిమన్యుడు' పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో 'సర్దార్' కథాలోచన వచ్చింది. ఆ తర్వాత నా రచయితల్లోని ఒకరితో చర్చించి పూర్తి కథ డెవలప్ చేశా. నిర్మాత లక్ష్మణ్‌కు ఈ కథ చెబితే ఆయన కార్తిని కలవమన్నారు. నిర్మాత చెప్పినట్టే కార్తిని కలిసి, స్టోరీ వినిపించా. ఆయనకు బాగా నచ్చడంతో ఈ సినిమాలో నటించారు.
ఇది పీరియాడికల్ చిత్రమా?
మిత్రన్: అవును. వర్తమానం, 1980లో నడిచే కథ ఇది. 1980లో 'ఇండియన్ ఇంటెలిజెన్స్' బృందంలోని ఒకరిని గూఢచారిగా తయారు చేయాలని ప్రయత్నించింది. కానీ, అది సాధ్యపడలేదు. ఆ సైన్యంలో పని చేసే వ్యక్తి గూఢచారిగా మారాలంటే అతనికి నటించటం రావాలి, మారువేషాలు వేయటం తెలియాలి. అది ఎంతో కష్టం కాబట్టి రంగస్థల నటుడినే గూఢచారిగా మార్చారు. ఆ సంఘటన 'సర్దార్కు' ఓ స్ఫూర్తి. దాన్నుంచి ఈ కథను అల్లుకున్నా.
కార్తి ఎలా కనిపిస్తారు?
మిత్రన్: ఈ సినిమాలో కార్తి పోషించిన పాత్ర కొత్త అనుభూతి పంచుతుంది. తండ్రీకొడుకులుగా ఆయన నటన అద్భుతం. ఇందులోని ఓ పాత్ర.. తన గురించి ప్రపంచానికి తెలియకూడదనుకుంటుంది. మరో పాత్ర పబ్లిసిటీని కోరుకుంటుంది. విభిన్నమైన ఈ పాత్రల్లో కార్తి ఒదిగిపోయారు. ఆయన నటించిన 'పొన్నియిన్ సెల్వన్ 1' ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. దాన్ని 'సర్దార్' కొనసాగిస్తుందనే నమ్మకం ఉంది.