తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సమంత​ 'కణ్మణి రాంబో ఖతీజా' ఎలా ఉందంటే? - Kanmani Rambo Khatija samanth

Kanmani Rambo Khatija Review: విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి, స్టార్​ హీరోయిన్లు స‌మంత, నయనతార ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నటించిన రొమాంటిక్ కామెడీ క‌థా చిత్రం 'కణ్మణి రాంబో ఖతీజా'. తెలుగులో ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

kanmani-rambo-khatija-movie review
kanmani-rambo-khatija-movie review

By

Published : Apr 28, 2022, 4:02 PM IST

Kanmani Rambo Khatija Review: చిత్రం: కణ్మణి రాంబో ఖతీజా; నటీనటులు: విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత, ప్రభు, కళా మాస్టర్‌, సీమ, రెడిన్‌ కింగ్‌స్లే తదితరులు; సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌; సినిమాటోగ్రఫీ: ఎస్‌.ఆర్‌.కథిర్‌, విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌; ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌; నిర్మాత: విఘ్నేశ్‌ శివన్‌, నయనతార, ఎస్‌.ఎస్‌.లలిత్‌ కుమార్‌; రచన, దర్శకత్వం: విఘ్నేశ్‌ శివన్‌; విడుదల: 28-04-2022

Kanmani Rambo Khatija: కొన్ని సినిమాలు కాంబినేష‌న్‌తోనే ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో కాతువాక్కుల రెండు కాదల్‌ ఒకటి. తెలుగులో కణ్మణి రాంబో ఖతీజా పేరుతో విడుదల చేశారు. విజయ్‌ సేతుపతి- న‌య‌న‌తార - స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రొమాంటిక్ కామెడీ క‌థ అన‌గానే ప్రేక్ష‌కులు ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ప్ర‌చార చిత్రాలు కూడా అందుకు త‌గ్గ‌ట్టే ఆకర్షించాయి. కానీ, తెలుగులో ఎలాంటి ప్ర‌చార ఆర్భాటం లేకుండా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిందీ చిత్రం. మ‌రి ఈ చిత్ర కథేంటి? ఎలా ఉంది? విఘ్నేశ్‌ శివ ఎలా తీశారు?

విజయ్‌ సేతుపతి, స‌మంత, నయనతార

క‌థేంటంటే.. ర్యాంబో (విజ‌య్ సేతుప‌తి) త‌న‌ని తాను దుర‌దృష్ట‌వంతుడిగా భావిస్తుంటాడు. చిన్నప్ప‌ట్నుంచి త‌న చుట్టూ జ‌రిగిన సంఘ‌ట‌న‌లు అలాంటివి. త‌న‌కి ఇష్ట‌మైన‌ది ఏదీ త‌న‌కి ద‌క్క‌దు. త‌న త‌ల్లికి కూడా దూరంగా ఉంటేనే ఆమె ఆరోగ్యంగా ఉంటుంద‌ని భావిస్తుంటాడు. కానీ, త‌న త‌ల్లి మాత్రం ఏదో ఒక రోజు ప్రేమ‌లో త‌డిసి ముద్ద‌వుతావ‌ని, నీకు ఇష్ట‌మైన‌వన్నీ నీకు ద‌క్కుతాయ‌ని చెబుతుంది. ప‌ట్నం వెళ్లి అక్క‌డే ప‌గ‌లు క్యాబ్ డ్రైవ‌ర్‌గా, రాత్రిళ్లు ప‌బ్‌లో బౌన్స‌ర్‌గా ప‌నిచేస్తున్న ర్యాంబోకి త‌న త‌ల్లి చెప్పిన‌ట్టుగానే ఒకేసారి ఇద్ద‌రి మ‌న‌సుల్ని సొంతం చేసుకుని వారి ప్రేమ‌లో త‌డిసి ముద్ద‌వుతాడు. క‌ణ్మ‌ణి (న‌య‌నతార‌), ఖ‌తీజా (స‌మంత)ల‌ని ప్రేమించిన ర్యాంబోకి ఆ త‌ర్వాత అస‌లు స‌మ‌స్య ఎదుర‌వుతుంది? ఆ ఇద్ద‌రు అమ్మాయిల‌కీ విష‌యం తెలిశాక ఏం జ‌రిగింది? ఇద్ద‌రిలో ర్యాంబో ఎవ‌రిని ఎంచుకున్నాడ‌నేది తెర‌పైనే చూడాలి.

విజయ్‌ సేతుపతి, స‌మంత, నయనతార

ఎలా ఉందంటే.. ఒక వ్య‌క్తి ఒకేసారి ఇద్ద‌రితో ప్రేమలో ప‌డ‌టం అనేది చాలా సినిమాల్లో చూసిందే. నిజానికి ఇది చాలా సీరియ‌స్ అంశం. ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ మాత్రం అలాంటి అంశానికి సున్నిత‌మైన హాస్యాన్ని మేళ‌వించి ఈ చిత్రాన్ని సీరియ‌స్‌గా కాకుండా స‌ర‌దాగా చూడాల‌ని చెప్ప‌క‌నే చెప్పారు. విఘ్నేష్ శివ‌న్ శైలి చ‌మ‌త్కారం, సంఘ‌ర్ష‌ణ ఉన్న క‌థ ఇది. ఒక అద్భుతం జ‌ర‌గ‌డానికి ముందు వ‌చ్చే ఓ కుదుపు అంటూ క‌థ‌ని మొద‌లు పెట్టాడు ద‌ర్శ‌కుడు. ర్యాంబో కుటుంబానికి ఉన్న శాపం, అత‌ను ప‌ల్లెటూరి నుంచి ప‌ట్నానికి రావ‌డం వంటి అంశాలతో క‌థ‌లోకి తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత ర్యాంబో ప‌గ‌టి జీవితం, రాత్రి జీవితాల్ని చూపెడుతూ.. ఆ జీవితాల్లోకి ఇద్ద‌ర‌మ్మాయిలు రావ‌డం, వాళ్ల‌తో ప్రేమ‌లో ప‌డే వైనాన్ని ఆవిష్క‌రించారు. మ‌ధ్య‌లో కొన్ని స‌న్నివేశాలు మ‌రీ నిదానంగా సాగిన‌ట్టు అనిపించినా, విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాల‌తో క‌థ‌లో ఆస‌క్తి మొద‌ల‌వుతుంది.

ర్యాంబో ఎవ‌రిని ఎంచుకుంటాడ‌నే ఉత్కంఠ మొద‌ల‌వుతుంది. కానీ ల‌వ్ యూ 'టూ' అన‌డంతో ఆ ఉత్కంఠ చివ‌రి వ‌ర‌కు అలా కొన‌సాగుతుంది. విరామం త‌ర్వాత టీ - కాఫీ, బాదం - పిస్తా అంటూ వచ్చే సన్నివేశాలు న‌వ్వులు పంచాయి. రెండు క‌త్తులు ఒక ఒర‌లో ఇమ‌డ‌న‌ట్టుగానే, ఇద్ద‌ర‌మ్మాయిలు ఒక వ్య‌క్తితో క‌లిసి ప్ర‌యాణం చేయ‌డం చాలా క‌ష్టం. అలా ఆలోచిస్తే ఈ క‌థతో ఏ ద‌శ‌లోనూ క‌నెక్ట్ కాలేడు ప్రేక్ష‌కులు. కానీ ద‌ర్శ‌కుడు దాన్ని సీరియ‌స్‌గా కాకుండా, వినోదాత్మ‌కంగా మ‌లిచారు. న‌య‌న‌తార‌, స‌మంత మ‌ధ్య స‌న్నివేశాలు న‌వ్విస్తాయి. ప‌తాక స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. ఇలా జ‌ర‌గ‌డం న‌మ్మ‌శ‌క్య‌మా అంటూ వాస్త‌విక‌త గురించి ఆలోచించ‌కుండా, కాల‌క్షేపం కోసం మాత్ర‌మే అన్న‌ట్టుగా సినిమా చూస్తే ఏ స‌మ‌స్యా ఉండ‌దు. అలా కాకుండా లాజిక‌ల్‌గా ఆలోచిస్తే మాత్రం ఈ సినిమా అంతగా మెప్పించ‌దు.

కణ్మణి రాంబో ఖతీజా

ఎవ‌రెలా చేశారంటే.. విజ‌య్ సేతుప‌తి, స‌మంత‌, న‌య‌న‌తార న‌ట‌నే చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. వాళ్లు ఆయా పాత్ర‌ల్లో అవ‌లీల‌గా ఒదిగిపోయి న‌టించారు. ప‌ర్‌ఫెక్ట్ టైమింగ్‌తో న‌వ్వించారు. నిజానికి న‌టులే ఈ క‌థ‌లో ఉన్న స‌గం మైన‌స్‌ల‌ని క‌నిపించ‌నీయ‌కుండా చేశారు. క‌ణ్మ‌ణి, ఖ‌తీజా పాత్ర‌ల‌కి న‌య‌న‌తార‌, స‌మంత స‌రైన ఎంపిక అనిపించారు. విజ‌య్ సేతుప‌తి విరామ స‌న్నివేశాల‌కి ముందు త‌న అభిన‌యంతో అల‌రిస్తారు. ఇద్ద‌రి వైపు చూస్తూ ఇద్ద‌రినీ ప్రేమిస్తున్నానన్న‌ట్టుగా చెప్పే సంభాష‌ణ‌లు సినిమాకే హైలైట్‌. ప్ర‌భు, శ్రీశాంత్ త‌ద‌దిత‌ర న‌టులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతిక విభాగాల్లో అనిరుధ్ సంగీతానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ఆయ‌న సంగీతం చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. ఎడిటింగ్ విభాగం కూడా చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచింది. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌కుడిగా మెప్పిస్తాడు కానీ, ర‌చ‌న ప‌రంగా అక్క‌డ‌క్క‌డా స్క్రిప్ట్‌లో స‌మ‌స్య‌లు క‌నిపిస్తాయి. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి.

బ‌లాలు
+ ప్ర‌ధాన న‌టులు
+ హాస్యం
+ ద్వితీయార్ధం
బ‌ల‌హీన‌త‌లు
- సాగ‌దీత‌గా అనిపించే కొన్ని స‌న్నివేశాలు
- వాస్త‌విక‌త లేని క‌థ
చివ‌రిగా:క‌ణ్మ‌ణి ఖ‌తీజా ర్యాంబో.. కొన్ని న‌వ్వుల కోసం

ABOUT THE AUTHOR

...view details