తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ సినిమా కోసం 250 రకాల తుపాకీలు తెప్పించా: లోకేశ్ కనగరాజ్​ - లోక్​ష్ కనగరాజ్​ ఖైదీ సినిమాలు

Vikram director Lokesh kanagaraj:ముగ్గురు స్టార్‌హీరోలని ఒక్క సినిమాలోకి తేవడమంటే మాటలు కాదు... వాళ్లలో ఒకరు నటశిఖరంగా పేరుతెచ్చుకున్నవారైతే ఆయన ఫ్యాన్స్‌ని మెప్పించడమూ అంత సులువు కాదు! ఆ పనిని 'విక్రమ్‌'తో అలవోకగా చేసి చూపాడు లోకేశ్‌ కనకరాజు. హాలీవుడ్‌ తరహాలో- తనదైన సినీకథా ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడతను. ఆ ప్రపంచంలోకి 'ఖైదీ'తో కార్తి, 'మాస్టర్‌'తో 'విజయ్‌, తాజాగా 'విక్రమ్‌'తో కమల్‌హాసన్‌, విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్లాంటి స్టార్లని తెచ్చి మెప్పిస్తున్నాడు. ఆ యువ దర్శకుడి ప్రయాణమిది...

vkram lokesh kanagaraj
విక్రమ్​ లోకేశ్​ కనగరాజ్

By

Published : Jun 19, 2022, 11:01 AM IST

Vikram director Lokesh kanagaraj: 'ప్రియమైన లోకేశ్‌! మీ పేరుకి ముందు 'శ్రీ' అనీ, పేరు తర్వాత 'గారు' అనీ గౌరవసూచకాలు చేర్చకపోవడం నా ఏమరుపాటేం కాదు. మీ నాన్న కనకరాజుగారికి మీపైనున్న వాత్సల్యంలో నేనూ కొంత వాటా తీసుకోవాలనుకుని అలా పిలిచాను. నా అభిమానులు మిగతావాళ్లకన్నా భిన్నంగా ఉండాలని నేను కోరుకుంటాను. భిన్నంగా ఉండటమే కాదు... వాళ్లలో అద్భుతమైన సృజనకారులూ ఉన్నారని మీరు నిరూపిస్తున్నారు. ఆ రకంగా మీరు నా అభిమాని కావడం నా భాగ్యంగా భావిస్తున్నాను. మిమ్మల్ని అభినందించడానికి మాటలు సరిపోవట్లేదు అని ఎవరైనా అంటే... నమ్మకండి. ఒక్కసారి అలా యూట్యూబ్‌ చూడండి... మిమ్మల్ని ఎన్ని భాషల్లో ఎన్నెన్ని పదాలతో పొగుడుతున్నారో! ఈ అభినందనలు ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను.-ప్రేమతో మీ కమల్‌హాసన్‌

విక్రమ్‌ సినిమా రిలీజైన ఐదోరోజు కమల్‌గారు నాకు పంపిన లేఖ ఇది. అది పోస్ట్‌లో రాగానే ఫొటో తీసి 'కమల్‌గారు ఇచ్చిన లైఫ్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ లేఖ ఇదే!' అంటూ ట్వీట్‌ చేశాను. నా జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు అనిపించి... ఉద్వేగంతో గొంతు పూడుకుపోయి... కన్నీటి తెర కమ్మిన క్షణాలవి. ఔను... నేను ఎవరి చిత్రాలైతే చూసి సినిమాలపైన మోజు పెంచుకున్నానో... ఎవరి దగ్గరైతే అసిస్టెంట్‌గా చేరాలని తపించానో... ఆయనకి 'యాక్షన్‌' చెప్పడం ఓ అద్భుతం కాదా! ఆ సినిమాని దక్షిణాది ప్రేక్షకులు నిండుమనసుతో ఆదరించడం అదృష్టం కాదా! నేను నటనాదైవంగా భావించిన వ్యక్తే ఇంత ఆత్మీయతతో లేఖ రాయడం ఓ వరం కాదా! ఆ అద్భుతం ఎలా జరిగిందో...ఆ అదృష్టం ఎలాదక్కిందో... ఆ వరమెలా చేరువైందో చెబుతాను...

హాలీవుడ్‌తో అలా పరిచయమైంది...తమిళనాడు కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉండే కిణత్తుకడవు అనే టౌన్‌ పంచాయతీలో చిన్న వ్యవసాయ కుటుంబం మాది. చిన్నప్పటి నుంచి నాకు లెక్కలంటే చచ్చేంత భయం. ఆ సబ్జెక్టులో తక్కువ మార్కులొచ్చి ఎన్నిసార్లు టీచర్ల దగ్గర దెబ్బలు తిన్నానో లెక్కేలేదు. కానీ మా ఇంగ్లిషు టీచర్‌ మీనా మేడమ్‌ మాత్రం కాస్త అభిమానంగా చూసేది. ఆమె వల్ల ఇంగ్లిషుపైన ఇష్టం పెరగడమే కాదు... ఇంగ్లీషు బాగా నేర్చుకోవడానికని హాలీవుడ్‌ సినిమాలూ చూడటం మొదలుపెట్టాను. వాటిని చూడటం తప్ప సినిమా అంటే తీరని ప్రేమో పిచ్చో ప్యాషనో లేవు నాలో. అందరు మధ్యతరగతి కుర్రాళ్లలాగే చక్కగా చదువుకుని ఓ మంచి ఉద్యోగంలో చేరితే చాలనుకున్నాను. కాకపోతే నేను ఏది చదివినా మ్యాథ్స్‌లేకుండా జాగ్రత్తపడాలనుకున్నాను. అందుకే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరాను. మూడేళ్ల తర్వాత డిగ్రీ అయితే చేతికొచ్చిందికానీ... ఆ రంగంపైన ఆసక్తి అసలు రాలేదు. దాంతో ఎంబీఏలో చేరాను. అదే నాకు ఎంతోకొంత నాయకత్వ లక్షణాలని నేర్పింది. ప్లానింగ్‌ అంటే ఏమిటో తెలిపింది. ఎంబీఏ అర్హతతోనే చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గానూ ఉద్యోగం వచ్చింది.

తొలి అడుగులు...హైదరాబాద్‌ అమీర్‌పేటలాగే చెన్నైలోని ట్రిప్లికేన్‌... 'బ్యాచిలర్స్‌ ప్యారడైజ్‌'. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవాళ్లే కాదు... ఉద్యోగమున్నా ఇంకా పెళ్ళికానివాళ్లందరూ అక్కడి పిచ్చుకగూళ్లలాంటి భవనాల్లో తలదాచుకుంటారు. దాదాపు పద్నాలుగేళ్ల కిందట నేనూ అలాంటి ఓ ఇంట్లో అద్దెకు చేరాను. రోజూ బ్యాంకులో పని పూర్తిచేసుకుని సాయంత్రం ఇంటికొస్తుండేవాణ్ణి. గదిలో ఏం తోచక తచ్చాడుతున్న నన్ను అక్కడో స్నేహబృందం ఆకట్టుకుంది. అదో సినిమా పిచ్చోళ్ల జట్టు. చౌకగా దొరికే డీవీడీల ద్వారా వాళ్లే నాకు ప్రపంచ సినిమాల్ని పరిచయం చేశారు. చిన్నప్పుడు ఇంగ్లిషు సినిమాలు చూసినప్పటి మోజు... ఇప్పుడు మళ్లీ రాజుకుంది. అలా హాలీవుడ్‌ సినిమాలకి ఫ్యాన్‌ అయ్యాను. కొన్నేళ్లు గడిచాక- ఆ సినిమాల పోకడని మన సమాజానికి తగ్గట్టు మార్చి... తమదైన ముద్రతో అందిస్తున్న కమల్‌హాసన్‌, మణిరత్నంలు నా ఆరాధ్యదైవాలయ్యారు. ముఖ్యంగా కమల్‌గారి 'మైఖెల్‌ మదన కామరాజు', 'సత్య' వంటివాటిని ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. మెల్లగా మా బ్యాంకులోని సహోద్యోగులందరూ సెలవుల్లో ఏయే సినిమాలు చూడాలో చెప్పమంటూ నన్ను అడగసాగారు. చిన్నదే కావొచ్చుకానీ ఉత్తమాభిరుచి ఉన్న సినీ అభిమానిగా దక్కిన ఆ కాస్త గుర్తింపే నాకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. సహోద్యోగుల ప్రోత్సాహంతోనే తొలిసారి షార్ట్‌ఫిల్మ్‌లు తీశాను. అలా నేను తీసిన చిత్రం ఒకటి- మా బ్యాంకు వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో మొదటి బహుమతి అందుకుంది. దానికి 'పిజ్జా' ఫేమ్‌ దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ న్యాయనిర్ణేతగా వచ్చి నాకు బహుమతిని అందిస్తూ- 'మీ ఫిల్మ్‌లో అంతర్లీనంగా ఎమోషనల్‌ కనెక్షన్‌ ఉంది. ఆ ఫ్లేవర్‌ కాపాడుకోండి!' అన్నాడు. అంతే...ఆ క్షణం నుంచీ నన్ను నేను దర్శకుడిగా భావించడం మొదలుపెట్టాను!

మొదటి సినిమా...కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు... నాటి నుంచీ నాకొచ్చిన జీతంలో కాస్త ఆదా చేసి షార్ట్‌ఫిల్మ్‌లు తీయడం ప్రారంభించాను. అప్పట్లో కమల్‌గారి దగ్గర సహాయకుడిగా చేరాలన్న ఆలోచన ఉండేదికానీ... నాకు బ్యాంకు జీతం తప్పనిసరి కాబట్టి ఆ సాహసం చేయలేకపోయాను. అయితేనేం స్క్రిప్టు రచన, ఎడిటింగ్‌, నటుల నుంచి నటన రాబట్టడం... ఇలా అన్నింటికీ 'గూగుల్‌'నే గురువుగా చేసుకున్నాను. అలా నేను తీసిన 'కళమ్‌' అన్న సినిమాకి ఓ తమిళ టీవీ ఛానెల్‌ నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్‌ పోటీలో బంగారు పతకం వచ్చింది. ఆ తర్వాత 'మానగరం' (తెలుగులో- నగరం) కథని సిద్ధం చేసుకుని నిర్మాతల చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. అదో ముగ్గురు వ్యక్తుల జీవితానికి సంబంధించి... 48 గంటల్లో జరిగే సంఘటనలతో సాగే 'హైపర్‌లింక్‌' కథ. తమిళంలో ఆ టెక్నిక్‌ చాలా కొత్త. స్క్రిప్టు చదివినవాళ్లందరూ 'ఇది మాకు అర్థం కావట్లేదు బాబూ!' అంటూ తిప్పికొట్టారు. అలా రెండేళ్ల ప్రయత్నం తర్వాత ఓ నిర్మాత అడ్వాన్స్‌ ఇచ్చారు. ఆయన అలా అడ్వాన్స్‌ ఇవ్వగానే నేను ఇలా ఉద్యోగానికి రాజీనామా చేశాను! కానీ... నా సినిమా పట్టాలెక్కడానికి ఎన్నో అవరోధాలొచ్చాయి. చిత్రీకరణ మొదలయ్యాకా పనులు సాగడానికి డబ్బులు సరిపోలేదు. అటు జీతంలేక... ఇటు నిర్మాణానికి తగ్గ డబ్బూ సరిపోక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నెలాఖర్లో భోజనానికీ ఇబ్బంది పడుతుంటే మా అద్దె ఇంటి దగ్గర హోటల్‌ నడిపే స్నేహితుడు ఉచితంగా భోజనం పెట్టేవాడు. ఎలాగైతేనేం-'మానగరం' సినిమాని అతితక్కువ బడ్జెట్‌తో ముగించి విడుదలచేశాం. మొదట్లో ఎవరూ పట్టించుకోకున్నా మెల్లగా పుంజుకుని... అనూహ్యంగా సూపర్‌హిట్టయింది. ఆ తర్వాతయినా నా ప్రయాణం సాఫీగా సాగిందా అంటే లేదు. అప్పట్లో హీరో సూర్య కోసం ఓ సైన్స్‌ ఫిక్షన్‌ కథ అనుకుని షూటింగ్‌ ప్రారంభిస్తే, కొన్నాళ్లకు బడ్జెట్‌ సమస్య వచ్చి ఆగిపోయింది. సొంతంగా ఆఫీసు కూడా పెట్టుకునే స్తోమత లేక... మా ఫ్రెండ్‌ అపార్ట్‌మెంట్‌లోని ఓ గదిని వాడుకుంటూ ఉండేవాళ్లం. అప్పుడే తమిళ మెగాస్టార్‌ విజయ్‌కి సినిమా చేసిపెట్టమంటూ అవకాశం వచ్చింది. అదీ అంతే... అందినట్టే అంది ఆగిపోయింది. అప్పుడే నన్ను నేను నిరూపించుకోవాలని 'ఖైదీ' అన్న చిన్న కథని సిద్ధం చేశాను. ఆ కథ హీరో కార్తీకి నచ్చి నటించడానికి ఒప్పుకోవడంతో... కేవలం 45 రోజుల్లో సినిమా పూర్తిచేశాను! పాటల్లేకుండా... అసలు నాయిక ఊసే ఎత్తకుండా తీసిన ఆ సినిమా నాకు దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ హిట్టుతో ఆగిపోయిన విజయ్‌ 'మాస్టర్‌' సినిమా మళ్లీ పట్టాలెక్కింది. నాదైన కథతో విజయ్‌సేతుపతిని ఇందులో విలన్‌గా చూపించడంతో... ఆ కథ తమిళం, తెలుగు భాషల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ఆ విజయమే నన్ను కమల్‌హాసన్‌ దృష్టిలో పడేలా చేసింది.

ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత!..కమల్‌ పిలిచారనగానే అదివరకు నా దగ్గరున్న కథల్లో ఒకదానికి దుమ్ముదులిపి ఆయన వద్దకి తీసుకెళ్లాను. ఆ కథ ఆయనకి నచ్చి తానే నిర్మిస్తానన్నారు. అలా మేం మాట్లాడుతూ ఉన్నప్పుడే ఎనభైల్లో ఆయన నటించిన విక్రమ్‌ (తెలుగులో 'ఏజెంట్‌ విక్రమ్‌ 007') ప్రస్తావన వచ్చింది. అప్పట్లో ఆ సినిమా పెద్దగా ఆడలేదట. ఆ కథకి మూలమైన ఓ పాత్ర గురించి కమల్‌హాసన్‌ నాతో చెబుతుండగానే... నా బుర్రలో ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఈ పాత్రతో- మరో కొత్త కథ తయారుచేస్తానని చెప్పి వచ్చాను. కానీ అది నేను అనుకున్నంత సులభం కాలేదు. నా ముందు ఎన్నో సవాళ్లు నిలిచాయి. మొదటిది- కమల్‌ ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత నటిస్తున్న సినిమా ఇది. కాబట్టి కథ ఆయన నటనకి స్కోప్‌ ఇచ్చేలా బలంగా ఉండాలి, అభిమానుల్ని కట్టిపడేయాలి. రెండోది- కమల్‌హాసన్‌ పాత్రకి తగ్గ భావగాంభీర్యం ఉండాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని కథ రాయడానికి రెండునెలలు పట్టింది. సిద్ధమైన కథని ఆయనకి చూపితే 'బావుంది. ఇందులో ప్రధానంగా మీదైన కథాప్రపంచమే(సినిమాటిక్‌ యూనివర్స్‌) కనిపిస్తోంది. సో... నేను కేవలం ఓ నటుడిగా షూట్‌కి వచ్చి వెళితే చాలనిపిస్తోంది!' అంటూ నవ్వేశారు.

నాదో యూనివర్స్‌!..ఇంతకీ ఏమిటి నా కథాప్రపంచం అంటారా... ఈ ధోరణి హాలీవుడ్‌లో ఉంది. ఉదాహరణకి 'అవెంజర్స్‌' సినిమాలు ఉన్నాయనుకోండి... వాటి కథాకథనాలూ, నటులూ ఎప్పటికప్పుడు వేరుగా ఉన్నా వాటి మధ్య ఏదో ఒక లంకె ఉంటుంది. కానీ ఆ లంకె ఉన్నంత మాత్రాన వీటన్నింటినీ ఒకే కథకి సంబంధించిన వివిధ భాగాలుగా(పార్ట్‌లు)నూ చెప్పలేం. ఈ ధోరణినే సినిమాటిక్‌ యూనివర్స్‌ అంటున్నారక్కడ. నా సినిమాలు అలాంటివి. నావన్నీ డ్రగ్‌ మాఫియాకి చెందిన చిత్రాలు. నా తొలి సినిమా 'మానగరం' నుంచి 'విక్రమ్‌' దాకా లంకెలెన్నో కనిపిస్తుంటాయి. ఇదో కొత్త ప్రయోగం. ఏదేమైతేనేం- కమల్‌గారు ఈ కథకి ఒప్పుకున్నాక ఒక్కొక్కటిగా గొంతెమ్మ కోరికలన్నీ విప్పడం మొదలుపెట్టాను! ఈ సినిమా కోసం 250 రకాల తుపాకులు కావాలంటే అన్నీ తెప్పించారు. అందులో చాలావరకూ ఆయన ఓ హాబీగా సేకరించినవే మరి! కథలోని రెండు బలమైన పాత్రల కోసం విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సూర్యలాంటి టాప్‌ హీరోలు కావాలంటే... వాళ్లని ఒప్పించారు. ముఖ్యంగా విజయ్‌ సేతుపతి... ఆయన బాడీలాంగ్వేజ్‌ కొత్తగా ఉండాలని ఓ సీనియర్‌ నటితో ఓ వర్క్‌షాపు ఏర్పాటుచేస్తే... అంత పెద్ద నటుడైనా ఓ విద్యార్థిలా హాజరయ్యారాయన. ఇక ఫహద్‌ మొదట్లో భాషాపరంగా ఇబ్బంది పడ్డా... కేవలం కొద్దిరోజుల్లోనే పాత్రలో ఇమిడి అద్భుతాలే చేశారు. కమల్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌... ముగ్గురితో విడివిడిగా సినిమా చేసినా సరే, దర్శకుడిగా జీవితాంతం గుర్తుండిపోయే చక్కటి పాఠాలని నేర్చుకోవచ్చు. అలాంటిది ముగ్గుర్నీ ఒకే తెరపైకి తేవడం ఓ గొప్ప అనుభవం. దాన్ని ప్రేక్షకులు ఇంతగా ఆదరించడం మహదానందం. అది చాలదన్నట్టు కమల్‌గారు ఆత్మీయ లేఖ రాయడం ఈ ఆనందాలన్నింటికీ తలమానికం... అంతకంటే ఏం చెప్పగలను?!

ఇదీ చూడండి: 'నాన్నకు ప్రేమతో'... ఈ హీరోయిన్లు ఏం చెబుతున్నారంటే..

ABOUT THE AUTHOR

...view details