తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కల్యాణ్​ రామ్​ 'అమిగోస్​' ఎలా ఉందంటే? - కల్యాణ్​ రామ్​ అమిగోస్ మూవీ అప్టేట్స్​

కల్యాణ్‌రామ్‌ త్రిపాత్రాభినయంలో నటించిన 'అమిగోస్‌' ఎలా ఉందంటే..?

amigos review
amigos review

By

Published : Feb 10, 2023, 1:23 PM IST

Amigos Review.. చిత్రం: అమిగోస్‌; నటీనటులు: కల్యాణ్‌రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, జయప్రకాష్, సప్తగిరి తదితరులు; సంగీతం: జిబ్రాన్‌; ఛాయాగ్రహణం: ఎస్‌.సౌందర్‌ రాజన్‌; నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్‌; నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌; రచన, దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి;విడుదల తేదీ: 10-02-2023

'బింబిసార'తో హిట్టు కొట్టి ఫుల్‌ జోష్‌లో ఉన్నారు కల్యాణ్‌రామ్‌ . ఆ ఊపులోనే ఇప్పుడు 'అమిగోస్‌' గా అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇది కల్యాణ్‌రామ్‌కు తొలి త్రిపాత్రాభినయ చిత్రం. కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కించారు. పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటం.. కల్యాణ్‌రామ్‌ ఓ పాత్రలో ప్రతినాయకుడిగా కనిపిస్తుండటం ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. మరి ఈ 'అమిగోస్‌' కథేంటి? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచింది? అనేది తెలుసుకునే ముందు ఈ సినిమా కథేంటో చూద్దాం.

కథేంటంటే: సిద్ధార్థ్‌ (కల్యాణ్‌రామ్‌) ది హైదరాబాద్‌. తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటుంటాడు. రేడియో జాకీగా పని చేసే ఇషికా (ఆషికా రంగనాథ్‌)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో వాళ్ల ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తాడు. కానీ, ఆ వ్యవహారం బెడిసి కొడుతుంది. అదే సమయంలో సిద్ధార్థ్‌ ఓ వెబ్‌సైట్‌ వల్ల తనలాగే ఉండే మంజునాథ్, మైఖేల్‌ను కలుసుకుంటాడు. ఒకలాగే ఉన్న ఆ ముగ్గురు చాలా దగ్గరవుతారు. మంజు, మైఖేల్‌ సాయంతో సిద్ధార్థ్‌ తన ప్రేమను పెళ్లి పట్టాలెక్కిస్తాడు.

ఆ తర్వాత సొంత ఊరు బెంగళూరుకు వెళ్లడానికి మంజునాథ్, కోల్‌కతాకు వెళ్లడానికి మైఖేల్‌ పయనమవుతారు. కానీ, ఇంతలో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అధికారులు మంజునాథ్‌పై కాల్పులు జరిపి.. అతన్ని తమ కస్టడీలోకి తీసుకుంటారు. అప్పుడే సిద్ధార్థ్‌కు మైఖేల్‌ గురించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తుంది. మైఖేల్‌ నరరూప రాక్షసుడని, అసలు పేరు బిపిన్‌ రాయ్‌ అని.. అతడిని పట్టుకోవడం కోసమే ఎన్‌ఐఏ వాళ్లు హైదరాబాద్‌కు వచ్చారని సిద్ధార్థ్‌ తెలుసుకుంటాడు.

బిపిన్‌ చేసిన మోసం వల్ల మంజు, తాను సమస్యల్లో చిక్కుకున్నట్లు గ్రహిస్తాడు. మరి బిపిన్‌ రాయ్‌ ఎవరు? అతడు మిగతా ఇద్దరి జీవితాల్లోకి రావడానికి కారణమేంటి? అతడు వేసిన ప్లాన్‌ నుంచి వీరిద్దరూ ఎలా తప్పించుకున్నారు? ఎన్‌ఐఏకు బిపిన్‌ను పట్టించారా? లేదా? అన్నది మిగతా కథ.

ఎలా ఉందంటే:ఒకే పోలికలతో ఉండే ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే కథ ఇది. అందులో ఒకడు ప్రతినాయకుడు. అతడు తన ఐడెంటిటీని దాచేందుకు తనలాగే ఉండే మిగతా ఇద్దరి జీవితాలతో ఎలా ఆడుకున్నాడు, అతని బారి నుంచి తప్పించుకునేందుకు మిగతా ఇద్దరు ఏం చేశారన్నది క్లుప్తంగా చిత్ర కథ. కథగా వినడానికి ఈ లైన్‌ చాలా బాగుంది. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్, ఎత్తులు పైఎత్తులతో రసవత్తరంగా స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకుంటే ఓ వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ అయ్యేది. కానీ, దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు.

సినిమాని ఆసక్తికరంగా నడపడంలో ఆది నుంచే తడబడ్డారు. సిద్ధార్థ్‌ పాత్ర కోణం నుంచి కథ ఆరంభించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. ఆషికాతో అతని ప్రేమకథ కాస్త బోరింగ్‌గా అనిపించినా.. దాన్ని వెంటనే కట్‌ చేసి అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఒకే పోలికలతో ఉన్న సిద్ధార్థ్, మంజునాథ్, మైఖేల్‌ ఒకచోటకు చేరాక కథలో వేగం పెరిగినట్లు అనిపిస్తుంది.

కానీ, ఆ వెంటనే సిద్ధార్థ్‌ లవ్‌ ట్రాక్‌ను తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకుల్ని నిరుత్సాహ పరుస్తాడు దర్శకుడు. విరామానికి ముందొచ్చే మలుపుతో కథ ఒక్కసారిగా యాక్షన్‌ మోడ్‌లోకి టర్న్‌ తీసుకుంటుంది. మైఖేల్‌ వేసిన ఎత్తుగడ వల్ల మంజునాథ్‌ ఎన్‌ఐఏ బృందానికి చిక్కడం.. ఆ వెంటనే సిద్ధార్థ్‌కు మైఖేల్‌ అసలు రూపం తెలియడం.. ద్వితీయార్ధం ఏం జరుగుతుందన్న ఆసక్తి మొదలవుతుంది.

ఇక ద్వితీయార్ధంలో మైఖేల్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ప్రేక్షకులను మెప్పిస్తోంది. బిపిన్‌ రాయ్‌ అనే నరరూప రాక్షసుడిగా కల్యాణ్‌రామ్‌ను తెరపై చూపించిన విధానం బాగుంటుంది. కానీ, అతడిలోని క్రూరత్వాన్ని ఆవిష్కరించే సన్నివేశాలు అంత ఆసక్తికరంగా ఉండవు. మైఖేల్‌ నుంచి తనని, తన కుటుంబాన్ని, మంజునాథ్‌ను కాపాడేందుకు సిద్ధార్థ్‌ చేసే ప్రయత్నాలు ఏమాత్రం మెప్పించవు. పతాక సన్నివేశాలు ఊహలకు తగ్గట్లుగా సాగడం.. ఎలాంటి మెరుపులు లేకపోవడంతో ఓ సాదాసీదా చిత్రం చూసినట్లుగా అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే:నటన, హవభావాల పరంగా కల్యాణ్‌రామ్‌ మూడు పాత్రల్లోనూ చక్కటి వేరియేషన్‌ చూపించారు. ముఖ్యంగా మైఖేల్‌గా ప్రతినాయక పాత్రలో కల్యాణ్‌రామ్‌ కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ పాత్రే ఈ చిత్రానికి ప్రధాన బలం. దీనికి తన వంతుగా ప్రత్యేకత చేకూర్చడానికి కల్యాణ్‌రామ్‌ చేయాల్సిందంతా చేశాడు. మిగతా రెండు పాత్రలు పరిధి మేరకే ఉంటాయి. ఇషికాగా ఆషికా అందంగా కనిపించింది. నటనకు పెద్దగా ఆస్కారం లేదు.

నిజానికి ఈ కథలో ఆమె పాత్ర, లవ్‌ ట్రాక్‌ లేకున్నా సినిమాకి వచ్చే నష్టమేమీ లేదు. బ్రహ్మాజీ పాత్రతో అక్కడక్కడా ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశారు దర్శకుడు. కానీ, అది వర్కవుట్‌ అవ్వలేదు. దర్శకుడి కథాలోచన బాగున్నా.. దాన్ని ఆసక్తికరంగా తెరపైకి తీసుకురాలేకపోయారు. స్క్రీన్‌ప్లే పరంగా చాలా లోపాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. ''ఎన్నో రాత్రులొస్తాయి' పాట బాగున్నప్పటికీ దాని ప్లేస్‌మెంట్‌ సరిగ్గా కుదర్లేదు. సౌందర్‌ రాజన్‌ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఓకే.

బలాలు:
1. కథా నేపథ్యం; 2. మైఖేల్‌గా కల్యాణ్‌రామ్‌ నటన; 3. ద్వితీయార్ధం

బలహీనతలు:
1. కథనం సాగిన తీరు; 2. లవ్‌ ట్రాక్‌

చివరిగా: 'అమిగోస్‌'.. అక్కడక్కడా మెప్పించే యాక్షన్‌ డ్రామా.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details