Kalyan Ram Bimbisara: విభిన్నమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఆఖరి రక్తపుబొట్టు వరకూ కష్టపడి పని చేస్తానని నటుడు కల్యాణ్ రామ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన 'బింబిసార' ఘనవిజయం సాధించిన సందర్భంగా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారందరికీ థ్యాంక్యూ చెబుతూ చిత్రబృందం ఓ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఇందులో భాగంగా కల్యాణ్‌రామ్ తమ చిత్రానికి అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
''2020 మార్చి 10న 'బింబిసార' మొదలుపెట్టాం. సినిమా ప్రారంభించిన ఐదో రోజే లాక్‌డౌన్ అన్నారు. మూడున్నర నెలల తర్వాత షూట్ తిరిగి ప్రారంభించాం. సెకండ్‌వేవ్.. మళ్లీ లాక్‌డౌన్ అన్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కంగారుపడ్డాను. ఏదో ఒక రకంగా షూట్ పూర్తి చేసి సినిమా విడుదల చేద్దాం అనుకునే సమయానికి ప్రేక్షకులు అస్సలు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తిగా లేరని ఎంతోమంది చెప్పుకుంటుంటే విన్నా. పైకి కంగారుగా అనిపించినప్పటికీ.. మంచి కంటెంట్‌తో సినిమా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మా. అదే ఇప్పుడు రుజువైంది. మా సినిమాకు మంచి విజయాన్ని అందించిన నందమూరి వీరాభిమానులు, సినీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కీరవాణి ఈ సినిమాకు ప్రాణం పోశారు. చోటా కె.నాయుడు నన్ను ఎంతో భరించి వర్క్ చేశాడు. సినిమా రిలీజ్ అయ్యాక ఎంతోమంది నటీనటుల నుంచి ఫోన్స్ వస్తున్నాయి. ఆ క్షణం మళ్లీ పుట్టాననిపించింది. నాకు పునర్జన్మనిచ్చిన చిత్రం 'బింబిసార'. ఇక, నేను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించేందుకు ఆఖరి రక్తపుబొట్టు వరకూ కష్టపడి వర్క్ చేస్తా.'' అని కల్యాణ్ రామ్ అన్నారు.