ఆదిపురుష్ సినిమా విడుదలైన రోజు నుంచి.. చిత్రంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయా పాత్రల పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. అయితే ఈ సినిమాలో రావణుడిని చూపిన విధానంపై పలువురు మండిపడ్డారు. రావణుడి పది తలలు రెండు వరుసల్లో ఉండడం, ఆ క్యారెక్టర్‌కు విచిత్రమైన హెయిర్ స్టైయిల్ పెట్టడం, అడిడాస్ బ్రాండ్‌కు సంబంధించి ఔట్ఫిట్ ఉపయోగించడం ఇలా పలు విషయాలు వివాదాలకు దారి తీశాయి. రావణుడి పాత్రను ఆ విధంగా చూపించడంపైన ప్రభాస్ ఫ్యాన్స్.. దర్శకుడు ఓం రౌత్పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..
అయితే ఈ విషయమై జై లవకుశ సినిమా విడుదల సందర్భంగా జూ. ఎన్టీఆర్మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాను రావణుడి పాత్ర వేసినప్పుడు రామాయణం గురించి, రావణుడి గురించి ఎంత పరిశోధన చేసింది అనేది ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ను యాంకర్.. రావణుడి గురించి సాధారణంగా అందరికీ తెలియని విషయాల గురించి ఏమైనా పరిశోధన చేశారా? అని ఓ ప్రశ్న అడిగింది. ప్రశ్నకు స్పందించిన ఎన్టీఆర్.." అటువంటి పౌరాణికానికి సంబంధించి పాత్రలు చేస్తున్నప్పుడు.. కొత్తగా ఇన్ఫర్మేషన్ వెతుక్కునే అవసరం లేదు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ పాడు చేయకుంటే చాలు" అని సమాధానం ఇచ్చారు.
"రావణుడి గురించి తెలుసుకోవాలంటే.. మనకు రామాయణం నుంచే కావాల్సినంత సమాచారం దొరుకుతుంది. కానీ నేను మరింత లోతుగా తెలుసుకోడానికి ఆనంద్ నీలకంఠ రాసిన 'అసుర' అనే పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకంలో రామాయణం.. రావణుడి కోణంలో నుంచి ఉంది. వాస్తవానికి రావణుడు 18 లోకాలకు రారాజు. ఆతడు అసురుల చక్రవర్తి. అన్ని లోకాలకు అధిపతి అయ్యాడంటే అతడికి ఎంత నేర్పు ఉండాలి. రాముడు లాంటి వ్యక్తియే యుద్ధం సమయంలో రావణాసురుడు ఎదురుపడగానే.. అతడిని చూడగానే ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అని పద్యాన్ని అందుకున్నాడు. అలా రావణాడు నిలబడితే శత్రువు సైతం అతడిని పొగిడేలా ఉండాలి. అలా ఆ పాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి అన్న విషయాలను తెలుసుకున్నాను.ఆ పుస్తకం నాకు ఆ క్యారెక్టర్ చెయడానికి సహాయపడింది."
- జూ ఎన్టీఆర్
అయితే ఆ వీడియో చూసిన నెటిజన్లు..'రావణుడి లాంటి పాత్ర చేస్తున్నప్పుడు, ఎన్టీఆర్‌లాగా వారి చరిత్ర పూర్తిగా తెలుసుకొని సినిమా తీయాల్సింది. యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు, ఎమోషన్స్ లాంటి పలు అంశాలను ఉన్నది ఉన్నట్టుగా తీసి, సరైన పద్దతిలో ప్రజెంటేషన్ చేసి ఉంటే.. సినిమా ఈరోజు ఇంకోలా ఉండేది. ఒక సినిమాలో కేవలం రావణుడి లాంటి పాత్ర చేస్తున్నప్పుడే ఎన్టీఅర్ అంత పరిశోధన చేశారు. అలాంటిది ఆదిపురుష్‌లో రావణుడి క్యారెక్టర్ కోసం ఎటువంటి రీసెర్చ్ చేయకపోయినా.. ఉన్నది ఉన్నట్టు చూపిస్తే సరిపోయేది' అని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.