టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలో. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. అయినప్పటికీ అవన్ని అవాస్తవాలే అంటూ కొట్టిపారేశారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అవన్ని నిజమే అని అనిపిస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాలో బన్నీ రోల్ ఉందన్న విషయం గట్టిగానే వినిపిస్తోంది. అప్పట్లో చెప్పినట్లే ఈ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్లో మెరవనున్నారట. అంతే కాకుండా ఈ సినిమాలో బన్నీ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యిందని టాక్.
ఇక ఈ వార్త విన్న అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బన్నీని ఆ స్టార్ హీరో సినిమాలో చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ విషయంపై మూవీ టీమ్ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఒక వేళ ఈ సినిమాలో బన్నీ ఎంట్రీని ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్గా ఉంచాలని డైరెక్టర్ ప్లాన్ చేశారేమో అని నెటిజన్లు అనుకుంటున్నారు.
'జవాన్' సినిమాతో పలువురు సౌత్ ఇండియన్ స్టార్స్ స్క్రీన్‌పై సందడి చేయనున్నారు. దర్శకుడు అట్లీ సౌత్ వ్యక్తి కాగా.. హీరోయిన్ నయనతార సౌత్‌లోనే ఫేమస్ అయిన స్టార్. వీరిద్దరు కూడా ఈ సినిమాతోనే బాలీవుడ్‌లోకి తొలిసారిగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక ఈ సినిమాలో మరో ఇద్దరు సౌత్ స్టార్స్ అయిన విజయ్ సేతుపతి, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతే కాకుండా ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె అతిథి పాత్ర పోషించనున్నారట. షారుఖ్ నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకులను బాగా కనెక్టయ్యారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 2న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఇక బన్నీ సినిమా లైనప్ విషయానికి వస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప 2' సినిమా షూట్లో పాల్గొంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా హిట్ 'పుష్ప'కు సీక్వెల్‌గా రెడీ అవుతోంది. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న నటించగా.. మొదటి పార్ట్ లాగే ఇందులోనూ ఫహాద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా కొన్ని రోజుల క్రితం సినిమాలో కీలక ఫైట్ సీన్స్ కోసం ఒడిశాకు చేరుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ షూట్‌కు బ్రేక్ పడినట్లు సమాచారం.