Highest Paid Actor in India :మన ఇండియాలో అత్యధిక పారితోషికం పొందే నటుల జాబితా తరచూ ఛేంజ్ అవుతూ ఉంటుంది. అయితే బాలీవుడ్‌కు చెందిన ఒక హీరో 2016లో ఒక్క సినిమాకు దాదాపు రూ. 275 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. కానీ అప్పుడు నుంచి ఒక్క హిట్ కూడా సాధించలేదు. గతంలో ఆయన ఖాతాలో చాలా మంచి సినిమాలున్నా ఈ మధ్య కాలంలో హిట్ కొట్టలేకపోయారు. ఇంతకీ ఎవరా నటుడంటే ఖాన్ త్రయంలో ఒకరైన ఆమిర్ ఖాన్.
ఆమిర్ ఖాన్ 2016లో నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన దంగల్‌లో నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమాలోని బాక్సాఫీసు రికార్డు బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ఆమిర్ దాదాపు రూ.275-300 కోట్లు తీసుకున్నారని టాక్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం తీసుకున్న రికార్డు బద్దలు కాలేదు. ఆ సినిమాలో ప్రాఫిట్ షేరింగ్ కాకుండా ఫీజు కింద రూ.35 కోట్లు వసూలు చేశారట. దంగల్ విడుదలైన సమయంలో ఇండియాలో రూ.500 కోట్లకుపైగా ఓవర్సీస్లో రూ.100 కోట్లకు పైగా రాబట్టింది. ఇవి కాకుండా సినిమా రైట్స్ విక్రయించినందుకు రూ.420 కోట్ల లాభం వచ్చింది. అందులో నుంచి ఆమిర్ రూ.140 కోట్ల షేర్ అందుకున్నారు. ఫీజుతో కలిపి రూ. 175 కోట్లు సంపాదించారు.
ఆ తర్వాత దంగల్ చైనాలో విడుదలైంది. ఆ దేశంలో అత్యధికంగా $200 మిలియన్లు వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఫోర్బ్స్ కథనం ప్రకారం చైనాలో విజయంతో ఆమిర్‌కు మరో 15 మిలియన్ డాలర్లు (రూ. 100 కోట్లు) ప్రాఫిట్ షేర్ వచ్చింది. ఓవరాల్‌గా ఆమిర్ ఈ సినిమా ద్వారా రూ. 275 కోట్లు సంపాదించారు. కొన్ని నివేదికల ప్రకారం సినిమా థియేటర్ రన్ పూర్తయ్యే నాటికి మొత్తం రూ. 300 కోట్లకుపైగా సంపాదించారు. ఇది బాహుబలి-1, పఠాన్ మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువ కావడం విశేషం.
కానీ అదే ఆమిర్ చివరి సోలో హిట్. 2017లో తన సొంత ప్రొడక్షన్ లో వచ్చిన సీక్రెట్ సూపర్ స్టార్‌లో సపోర్టింగ్‌లో నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లు వసూలు చేసింది. అయితే అందులో లీడ్ రోల్ కాకపోవడంతో క్రెడిట్ అంతా మెయిన్ రోల్లో నటించిన జైరా వాసిమ్కు వచ్చింది. ఆ తర్వాత ఏడాదిలో ఆయన కథానాయకుడిగా నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ వచ్చింది. దీన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. కానీ అనుకున్నంత ఆడలేదు. చివరికి ఫ్లాప్‌గా మిగిలిపోయింది.
2022లో లాల్ సింగ్ చద్దాతో ఆమిర్ వెండితెరపై దర్శనం ఇచ్చారు. కానీ ఇది కూడా ఆడలేదు. ఇలా వరుసగా అపజయాలు చుట్టు ముట్టాయి. ఇలా జరగడం 20 ఏళ్లలో అదే తొలిసారి. లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన తర్వాత ఆమిర్ కొంతకాలం నటనకు విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహిస్తున్నLaapataa Ladies అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది ఈ ఏడాది జనవరి థియేటర్లలో విడుదల కానుంది.