తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం.. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు - విజయవాడ తాజా వార్తలు

AP High Court : ఆన్​లైన్​లో సినిమా టిక్కెట్ల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ.. పలు ఆన్​లైన్​ విక్రయ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారం రోజున విచారణ జరిపింది.

AP High Court
AP High Court

By

Published : Jun 30, 2022, 8:36 AM IST

AP High Court :ఏపీప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్‌ వేదిక ద్వారా మాత్రమే సినిమా టికెట్లను విక్రయించేందుకు తీసుకొచ్చిన సవరణ చట్టం, నిబంధనలు, జీవోలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో అనుబంధ పిటిషన్లపై బుధవారం ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. దాంతో జులై 1న దీనిపై తగిన ఉత్తర్వులిస్తామని ధర్మాసనం పేర్కొంది. ప్రధాన వ్యాజ్యాలపై జులై 27న తుది విచారణ చేస్తామంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు వీలుగా 2021 డిసెంబర్‌ 15న తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని, టికెట్ల విక్రయ ప్లాట్‌ఫామ్‌ నిర్వహణను ఏపీ స్టేట్‌, ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టివీటిడీసీ)కి అప్పగిస్తూ డిసెంబర్‌ 17న జారీ చేసిన జీవో 142ను సవాల్‌ చేస్తూ బుక్‌ మై షో సంస్థ, మల్టీఫ్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, తదితర సంస్థలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం రూపొందించబోయే ఆన్‌లైన్‌ వేదిక ద్వారా మాత్రమే ప్రైవేటు సంస్థలను టికెట్లను విక్రయించాలని ఒత్తిడి చేయడంపై ప్రధానంగా అభ్యంతరం తెలిపాయి. బుక్‌ మై షో తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు కొనసాగిస్తూ.. పోటీకి దిగుతూ తాము విక్రయించిన టికెట్‌కు రూ.2 చొప్పున సర్వీసు ఛార్జీ చెల్లించాలనడం సరికాదని, కన్వీనియన్స్‌, సర్వీసు ఛార్జీలు అన్నీ కలిపితే టికెట్‌ను అధిక ధరకు విక్రయించాల్సి వస్తుందన్నారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వం సర్వీసు ఛార్జీలను మాత్రమే వసూలు చేయనుండటంతో అక్కడ టికెట్‌ ధర తక్కువ ఉంటుందని, దానిపైనే మీ అభ్యంతరంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. మరో సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తమ వ్యాపారాల్లో జోక్యం చేసుకోకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని, తాము పన్ను ఎగవేస్తున్నామన్న ప్రభుత్వ వాదనల్లో వాస్తవం లేదన్నారు.

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాల తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ‘థియేటర్ల మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం చూసుకుంటూ యాజమాన్యాలను క్యాంటీన్‌, పార్కింగ్‌ నిర్వహణకు పరిమితం చేస్తోంది. ప్రభుత్వం నేరుగా వచ్చి తమ బాక్సాఫీసులో కూర్చొంటోంది. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితులు కల్పించడం లేదు. యాజమాన్యాల మనుగడనే దెబ్బతీసేలా ఉంది...’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. భాగస్వాములందరితో చర్చించి ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చిందని, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు.

ABOUT THE AUTHOR

...view details