'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే బాలీవుడ్ సినిమాతో 2005లో తెరంగేట్రం చేశారు హీరోయిన్ తమన్నా. అదే ఏడాది 'శ్రీ' చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమమ్యారు. 'హ్యాపీడేస్'తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఎన్నో హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఈ క్రమంలోనే ఆమె.. ఇప్పుడిప్పుడే స్టార్ యాక్టర్‌గా ఎదుగుతున్న నటుడు సత్యదేవ్‌తో కలిసి ఓ చిన్న సినిమాలో నటించారు. అదే 'గుర్తుందా శీతాకాలం'. డిసెంబరు 9న ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా మూవీ రిలీజ్‌కు ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్.. తమన్నా గురించి మాట్లాడుతూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇంకా చిత్ర విశేషాలను తెలిపారు.. ఆ వివరాలు..
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో సందడి చేస్తున్నారు హీరో సత్యదేవ్. ఇటీవలే గాడ్‌ఫాదర్‌లో ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించిన ఆయన.. ఇప్పుడు హీరోగా గుర్తుందా శీతాకాలంతో పలకరించారు. కన్నడలో విజయవంతమైన లవ్ మాక్‌టైల్‌కు రీమేక్‌గా రూపొందింది. నాగశేఖర్ తెరకెక్కించారు. ఆ సినిమా గురించి సత్యేదేవ్ మాట్లాడుతూ.. "ఈ ఏడాదిలో నా నుంచి వస్తున్న ఐదో చిత్రమిది. చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి అన్నయ్య ముందే చెప్పినట్లుగా గాడ్‌ఫాదర్ చిత్రంతో ద్వారా నేను మరింత మందికి చేరువయ్యా. ఇలాంటి తరుణంలో గుర్తుందా శీతాకాలం లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. నేనిందులో దేవ్ అనే పాత్రలో కనిపిస్తా. అతని జీవితంలోని నాలుగు ప్రేమకథల్ని ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇలాంటి సినిమా నేనిప్పటి వరకు చేయలేదు. తమన్నా పాత్ర ప్రవేశించాక ఈ చిత్ర స్వరూపమే మారిపోతుంది". అని అన్నారు.
"ఒక చిత్రంలో మూడు భిన్న వయసులున్న పాత్ర చేసే అవకాశం రావడం చాలా అరుదు. కాబట్టి ప్రేక్షకుల్ని ఒప్పించడానికి ఈ పాత్రల కోసం చాలా కష్టపడ్డా. తమన్నా ఈ చిత్రం చేయడానికి ఒప్పుకుందని తెలియగానే షాకయ్యా. ఆమె ఇందులో నిధి అనే పాత్రలో కనిపిస్తుంది. ఇది కన్నడ చిత్రానికి రీమేక్ అయినా.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మంచి మార్పులు చేశాం. ప్రేమకథా చిత్రాలు విశ్వజనీనమైనవి. అవి ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ మధ్య వచ్చిన 'సీతారామం', 'లవ్‌టుడే' వంటి చిత్రాల్ని ఆదరించినట్లే.. మా సినిమాని ఆదరిస్తారని నమ్ముతున్నా".