Mahesh Babu New Car : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు 'గుంటూరు కారం' షూటింగ్లో బిజీగా ఉన్న ఈ స్టార్.. దర్శక ధీరుడు రాజమౌళితో యాక్షన్ అడ్వెంచర్ మూవీకి కూడా సైన్ చేశారు. ఈ క్రమంలో వరుస షెడ్యూల్లతో కాల్షీట్లను నింపేసిన మహేశ్ తాజాగా మరో సారి వార్తలోకెక్కారు. ఇటీవలే ఆయన ఓ సరికొత్త కారును కొన్నారట.
బంగారు వర్ణంలో ఉన్న ఆ బ్రాండెడ్ రేంజ్ రోవర్ ఎస్వీ కారు గురించే ఇప్పుడు సోషల్ మీడియా అంతా టాక్. హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఆ గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారు ధర దాదాపు రూ. 5.40 కోట్లు అని సమాచారం. ఇలాంటి మోడల్ కార్ ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్‌తో పాటు చిరంజీవి, మోహన్‌లాల్, ఎన్టీఆర్ లాంటి స్టార్ల దగ్గర ఉంది కానీ ఇలాంటి కలర్లో మాత్రం మహేశ్ వద్దనే ఉండటం విశేషం.
మహేశ్ బాబు రేంజ్ రోవర్ కారు Mahesh Babu Movies : ఇక మహేశ్ సినిమా విషయానికి వస్తే.. పలు భారీ ప్రాజెక్టులకు సైన్ చేసిన మహేశ్.. ప్రస్తుతం 'గుంటూరు కారం'లో తన షెడ్యూల్‌ను ముగించే పనుల్లో ఉన్నారు. శనివారం హైదరాబాద్ శివార్లలో కొత్త షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. ఈ క్రమంలో మహేశ్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ తొలి వారం వరకూ చిత్రీకరణ చేసుకున్న ఈ సినిమా... సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పట్టాలెక్కింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్.రాధాకృష్ణ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. 'అతడు', 'ఖలేజా' తర్వాత త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో వస్తున్న మూడవ సినిమా ఇది.
Guntur Kaaram Movie : ఇందులో మహేశ్ సరసన శ్రీలీల నటిస్తున్నారు. అయితే తొలుత పూజా హెగ్డే కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉండగా.. ఇప్పుడు ఆమె కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై అటు మూవీ టీమ్ కానీ ఇటు పూజా హెగ్డే కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కానీ ఆమె స్థానంలో హిట్ బ్యూటీ మీనాక్షి చౌదరిని తీసుకుంటున్నట్లు టాక్. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈయన కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చినప్పటికీ అవన్ని అవాస్తవమని తేలింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాపై వస్తున్న రూమర్స్‌ను చూస్తుంటే అనౌన్స్ చేసిన సమయానికి గుంటూరు కారం రిలీజవ్వడం కష్టమే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
SSMB 29 : ఇక మహేశ్ 29వ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. అయితే ఇటీవలే ఆ ప్రాజెక్ట్ గురించి రచయిత విజయేంద్రప్రసాద్ బాలీవుడ్ మీడియాతో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు. జులైలోపు స్క్రిప్ట్ పూర్తి చేసి, రాజమౌళికి అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. దానికి కొనసాగింపుగా మరో చిత్రాన్నీ తెరకెక్కించేందుకు ఆస్కారం ఉందని.. దీనికి అనుగుణంగానే పతాక సన్నివేశాల్ని అలా మలిచినట్టు ఆయన తెలిపారు.