చిత్రసీమలో ఈ సంక్రాంతి ఎంత ప్రత్యేకంగా నిలిచిందో తెలిసిన విషయమే. ఒకే నిర్మాణ సంస్థ రూపొందించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలకావడం, అందులోనూ అవి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చిత్రాలు కావడం విశేషం. ఈ అగ్రహీరోలిద్దరూ ఒక్క రోజు గ్యాప్‌లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఇద్దరు కలిసి ప్రేక్షకుల చేత ఈలలు వేయించి.. దాదాపు రూ.350కోట్లకు పైగా వసూలు చేశారు. అయితే ఈ సందడి ముగిసింది దాదాపు నెల రోజులు కావొస్తుంది.
ఇప్పుడు చిరంజీవి, బాలయ్య తమ కొత్త చిత్రాలతో కూడా ఫుల్ బిజీ అయిపోయారు. షూటింగ్లలో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోస్‌కు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ బాబీ(వాల్తేరు), గోపిచంద్ మలినేని(వీరయ్య) మాత్రం ఇంకా తమ కొత్త సినిమాలను ప్రకటించలేదు. అయితే వీరి నుంచి ఎలాంటి సినిమా రానుంది, వీరు ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది. ఈ డైరెక్టర్లిద్దరూ ప్రస్తుతం ఫలానా హీరోతో చేయబోతున్నారని కొంతమంది పేర్లు వినిపించాయి. కానీ వీటిపై ఇప్పటివరకు ఓ క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఓ ఆసక్తికరమైన సమాచారం చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ దర్శకులు తమ హీరోలను ఎక్స్ఛేంజ్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి! ప్రస్తుతం యంగ్ జనరేషన్ స్టార్ హీరోలంతా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో మళ్లీ సీనియర్ హీరోలతోనే చేయాలనుకుంటున్నారట. అలా ఈ సారి బాలకృష్ణతో బాబీ, చిరంజీవితో గోపిచంద్ మలినేని సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రావాలని ఆలోచిస్తున్నారట. హీరోలిద్దరితో చర్చలు జరిపించేందుకు ట్రై చేస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్తలు షికార్లు చేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.