తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రామోజీకి NTR సెంటినరీ అవార్డు.. ఉత్తమ ఛానల్​గా ఈటీవీ.. అట్టహాసంగా ఫాస్‌ సినీ అవార్డుల ప్రదానం

ఫిలిం ఎనలిటికల్‌, అప్రిసియేషన్‌ సొసైటీ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో కన్నులపండువగా జరిగింది. ప్రతిష్టాత్మక ఎన్టీఆర్‌ సెంటినరీ సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డును ప్రముఖ రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు ప్రకటించారు. ఇక ఉత్తమ టీవీ(సినిమా) విభాగంలో ఈటీవీ ఛానల్​కు ఈ అవార్డు దక్కింది.

Film Analytical and Appreciation Society Awards 2023
రామోజీరావు తరఫున అవార్డును అందుకుంటున్న ఈటీవీ చీఫ్‌ ప్రొడ్యూసర్‌ అజయ్‌ శాంతి

By

Published : May 8, 2023, 7:48 AM IST

ఫిలిం ఎనలిటికల్‌, అప్రిసియేషన్‌ సొసైటీ (ఫాస్‌) అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన సినీనటుడు మురళీమోహన్‌తో పాటు ఫాస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ కె.ధర్మారావు గెలుపొందిన వారికి తమ చేతులమీదగా పురస్కారాలను అందజేశారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక ఎన్టీఆర్‌ సెంటినరీ సిల్వర్‌ క్రౌన్‌ ఫిలిం అవార్డును ప్రముఖ రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు ప్రకటించారు. ఈ అవార్డును ఆయన తరఫున ఈటీవీ చీఫ్‌ ప్రొడ్యూసర్‌ అజయ్‌ శాంతి స్వీకరించారు. మరోవైపు ఉత్తమ నటుడి అవార్డును టాలీవుడ్​ సీనియర్​ హీరో సుమన్‌కు అందించగా.. జీవన సాఫల్య పురస్కారాలను అలనాటి సీనియర్​ నటి రోజా రమణి, ప్రముఖ టాలీవుడ్​ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ వేదికకు విచ్చేసి అందుకొన్నారు.

ఇవే కాకుండా ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో అక్కినేని-ఫాస్‌ సిల్వర్‌ జూబ్లీ, మహిళా సిల్వర్‌ పీకాక్‌ అవార్డులను కూడా అందించారు. ఇందులో అక్కినేని-ఫాస్‌ సిల్వర్‌ జూబ్లీ, మహిళా సిల్వర్‌ పీకాక్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా పెళ్లిసందడి, ఉత్తమ దర్శకురాలు గౌరి రోణంకి, ఉత్తమ మహిళా నిర్మాత ఎన్‌.ఆర్‌.అనురాధాదేవి, ఉత్తమ నటి దివ్యవాణి, ఉత్తమ గాయని పురస్కారానికి మాళవిక, ఉత్తమ సినీ అవార్డుల సంస్థగా వంశీ ఇంటర్నేషనల్‌ ప్రతినిధి వంశీ రామరాజు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఇక ఉత్తమ టీవీ(సినిమా) విభాగంలో ఈటీవీ ఛానల్​కు ఈ అవార్డు దక్కింది.

జీవిత సాఫల్య పురస్కారాలను అందుకుంటున్న రోజారమణి, పరుచూరి గోపాల కృష్ణ

దర్శకరత్న దివంగత దాసరి-ఫాస్‌ సిల్వర్‌ జూబ్లీ, సిల్వర్‌ నంది సినీ అవార్డుల విభాగంలో ప్రకటించిన జీవన సాఫల్య పురస్కారాలను ప్రముఖ సినీ నిర్మాత సి.కల్యాణ్‌ అందుకున్నారు. ఆయనతో పాటు దర్శకుడు రేలంగి నరసింహారావు కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ అవార్డులను 2018 నుంచి 2023 వరకు వచ్చిన ఉత్తమ చిత్రాలకు అందించారు. 2018లో సంవత్సరానికి గానూ 'కేరాఫ్​ కంచరపాలెం' ఈ అవార్డును అందుకుంది. ఇక 2019కి 'ఫలక్‌నుమా దాస్'​ను ఈ అవార్డు వరించగా.. 2020కి 'పలాస' సినిమా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకుంది.

ఇక 2021 ఏడాది విన్నరైన 'జాతిరత్నాలు' చిత్రానికి నిర్మాత ప్రియాంకదత్‌, 2022 'డీజే టిల్లు' చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, 2023లో వచ్చిన బలగం చిత్రానికి నిర్మాత హర్షిత్‌రెడ్డి.. ఆయా సినిమాలకు పురస్కారాలను స్వీకరించారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి అవార్డు గ్రహీతలతో పాటు సినీ ప్రముఖులు హాజరై వేడుకను విజయవంతం చేశారు. ఇక కార్యక్రమంలో నిర్వాహక ఛైర్మన్‌ లయన్‌ విజయ్‌కుమార్‌, నిర్వాహకసభ్యులు బండారు సుబ్బారావు, శంకర్‌రావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details