ఎప్పుడూ నవ్విస్తారు.. "మా నాన్న మంజునాథ హెగ్డే న్యాయవాది. చిన్నప్పటినుంచీ మా నాన్నను సీరియస్‌గా చూసిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే.. ఆయన ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ చాలా సరదాగా ఉంటారు. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ ఇప్పటివరకూ నాన్నలాంటి వ్యక్తిని అస్సలు చూడలేదు. నన్నూ, అన్నయ్యనూ కూర్చోబెట్టుకుని రకరకాల కథల్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పడం, జోకులు వేయడం.. ఇలా నాన్నతో మాకు చెప్పలేనన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఎంత పెద్ద సమస్య ఎదురైనా సరే దాన్ని నవ్వుతూనే పరిష్కరించుకుంటారు తప్ప బాధ, కోపం.. వంటివి ఆయన ముఖంలో కనిపించవు. మా నాన్న నుంచి ఏదయినా వారసత్వంగా అందుకోమంటే ఆయనలోని హాస్యచతురతనే కోరుకుంటా. చిన్నప్పటినుంచీ నాన్నను చూస్తూ పెరిగిన నేనూ... ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నా. ఎంత పని ఉన్నా, షూటింగ్‌లతో విశ్రాంతి లేకపోయినా సరే వీలైనంతవరకూ ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకే ప్రయత్నిస్తుంటా" అని పూజాహెగ్డే చెప్పారు.
పర్సులో డబ్బులు తీసేదాన్ని.. "సెట్లో దర్శకుడి నుంచి స్పాట్‌బాయ్ వరకూ అందరినీ సమానంగా చూడటం, సరదాగా ఉండటం, చెప్పిన సమయానికి షూటింగ్‌కి వెళ్లడం, ఒత్తిడి, చిరాకు లాంటివి ముఖంమీద కనిపించనీయకపోవడం.. ఇవన్నీ నాకు మా నాన్న సురేష్ కుమార్ నుంచే వచ్చాయి. నాన్న నిర్మాతగా, నటుడిగా పేరు తెచ్చుకున్నా చాలా సింపుల్‌గా ఉండటం నాకు నచ్చుతుంది. అందుకే నేనూ ఆయనలానే ఉండేందుకు ఇష్టపడుతుంటా. మొదటిసారి షూటింగ్‌కు వెళ్తున్నప్పుడు నాన్న 'మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి' అన్నారు. ఆ మాటల్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడంటే నేనూ సంపాదిస్తున్నా కానీ చిన్నప్పుడు నాన్న పర్సులో డబ్బులు తీసేయడం... దానికి నాన్న మందలించడం నాకు ఇప్పటికీ గుర్తే." అని కీర్తి సురేశ్ అన్నారు.
ఆ విషయాన్ని నాన్న నేర్పిందే.. "పనిలో రాజీపడకపోవడం, సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వడం, క్రమశిక్షణ... ఇవన్నీ నాకు మా నాన్న కురియన్ నుంచే వచ్చాయి. ఆయన ఎయిర్‌ఫోర్స్ అధికారిగా చేసేవారు. ఒకప్పుడు ఆయన క్రమశిక్షణకూ, సమయపాలనకూ మారుపేరు. రోజూ పొద్దున్నే యూనిఫాంలో ఠీవిగా ఆఫీసుకు వెళ్లే ఓ పర్‌ఫెక్ట్‌మ్యాన్ మా నాన్న. అలాంటి నాన్న కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే ఆయనతో ఎక్కువగా గడపాలని కోరుకుంటున్నా. నాకు కాలాన్ని వెనక్కి తిప్పే అవకాశం వస్తే గనుక.. ఆయన్ని పూర్తి ఆరోగ్యవంతుడిలా మార్చేయాలని కోరుకుంటా. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి ఆయనే కారణం. మా నాన్నే నాకు హీరో మరి." అని నయనతార పేర్కొన్నారు.