తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2022, 6:48 AM IST

ETV Bharat / entertainment

Acharya movie: 'అందులో ఎలాంటి నిజం లేదు'

Chiranjeevi Acharya movie: మెగాస్టార్ చిరంజీవి, రామ్​చరణ్​ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. కాజల్​ అగర్వాల్​, పూజాహెగ్డే హీరోయిన్లు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు అగ్ర దర్శకుడు కొరటాల శివ. ఆ సంగతులివీ...

acharya movie release date
ఆచార్య సినిమా రిలీజ్​ డేట్​

Chiranjeevi Acharya movie: సందేశాన్ని... భావోద్వేగాన్ని.. మాస్‌ను... కలిపి హిట్‌ ఫార్మలా తయారు చేయగల వెండితెర సైంటిస్ట్‌ కొరటాల శివ. 'మంచి కథే చెబుదాం, పెద్ద కథే రాద్దాం...' అనేది ఆయన తరచూ చెప్పే మాట. ఆ మాటకి తగ్గట్టే ఉంటాయి ఆయన సినిమాలు! హృదయాల్ని హత్తుకునేలా తెరపైన భావోద్వేగాలు పండుతాయి. అభిమానులు గుర్తు పెట్టుకునేలా హీరోయిజాన్ని ఆవిష్కరిస్తుంటారు. ఆ కథాంశాలు సమాజంలో స్ఫూర్తిని రగిలిస్తుంటాయి. ఇటీవల చిరంజీవి, రామ్‌చరణ్‌ కథానాయకులుగా 'ఆచార్య' తెరకెక్కించారు. ఆ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు అగ్ర దర్శకుడు కొరటాల శివ.

కథ రాయడం పూర్తి కాగానే ఎప్పుడెప్పుడు ప్రేక్షకులకు చూపించేద్దాం అనే ఆత్రుతతో కనిపిస్తుంటారు దర్శకులు. ఈసారి మీ ఆత్రుతను నాలుగేళ్లు ఆపుకోవాల్సి వచ్చింది కదా?

ఎవ్వరూ ఊహించలేదు ఇలా జరుగుతుందని! కరోనా వల్ల అందరికీ రెండేళ్ల సమయం వృథా అయింది. ప్రయాణం బాగుంటే ఎంత ఆలస్యమైనా ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మనసులో పదిలమవుతాయి. 'ఆచార్య' రూపంలో ఒక మంచి సినిమా చేశాం, మంచి వ్యక్తులతో ప్రయాణం చేశాం. అందుకే ఆ విషయంలో ఎలాంటి అసంతృప్తీ లేదు. కొన్నిసార్లు ఆలస్యమూ సినిమాలకి మేలే చేస్తుంది. 'ఆచార్య'తో పాటు రామ్‌చరణ్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' చేశారు. దాంతో డేట్స్‌ ఇబ్బందిగా ఉండేవి. 'ఆచార్య' ఆలస్యం కావడంతో డేట్స్‌ విషయంలో ఇబ్బంది రాలేదు. నిర్మాణానంతర కార్యక్రమాలకూ తగినంత సమయం దొరికింది.

మధ్యలో కొన్ని సన్నివేశాల్ని రీ షూట్‌ చేశారట! నిజమేనా?

‘ఆచార్య’ విషయంలో రీ షూట్‌ అనేది జరగలేదు. అయితే రీ షూట్‌ అనేది ఓ తప్పు గానో లేదంటే ఫిర్యాదు గానో మాట్లాడుతుంటారు చాలామంది. అది నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఓ సన్నివేశాన్ని ఇంతకంటే బాగా తీయొచ్చు అనే అభిప్రాయం దర్శకుడిలో కలిగిందంటే రీ షూట్‌కి వెళ్లొచ్చు. అది మంచి విషయం కదా. సన్నివేశం బాగోలేకపోయినా ఇది చాల్లే అనుకోవడం తప్పు అవుతుంది కానీ, ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని అందించడం కోసం రీ షూట్‌కి వెళ్లడం తప్పు ఎలా అవుతుంది? రీ షూట్‌ చేసే అవకాశం వస్తే నేను సంకోచించకుండా వెళ్లి నిర్మాతని ఒప్పించి చేస్తాను.

'ఆచార్య'తో ఏం చెప్పనున్నారు?

ఒక మంచి, పెద్ద కథని చెప్పనున్నాం. వాణిజ్యపరంగా అత్యున్నతమైన అనుభూతినిచ్చే కథ. చిరంజీవి, చరణ్‌ కలిసి సినిమా చేసినప్పుడు కచ్చితంగా అభిమానులకి కన్నుల పండగలా ఉంటుంది. వాళ్లతోపాటు సినీ ప్రేమికులు ఓ గొప్ప కథని ఆస్వాదించామనే అనుభూతికి గురవుతారు.

ఈ కథ ఎలా పుట్టింది?

యాదృచ్చికంగా వచ్చిన ఓ ఆలోచన నుంచి పుట్టిన కథే ఇది. నాకు చిరంజీవిని చూడగానే ఆచార్య అనే ఫీలింగ్‌ వస్తుంది. పైగా ఆయన్ని చూస్తూ పెరిగాం. సహజంగానే నేను లార్జర్‌ దేన్‌ లైఫ్‌ తరహా కథల్ని రాస్తుంటాను. నా ఆలోచనలకి ఈసారి అదే తరహా ఇమేజ్‌ తోడైంది. అక్కడి నుంచి మంచి పాత్రలు, మంచి భావోద్వేగాలు కలిసి ‘ఆచార్య’ కథ అయ్యింది. ఈ సినిమా కోసం రెండు భిన్నమైన నేపథ్యాల్ని ఎంచుకున్నా.

చిరంజీవిని దృష్టిలో పెట్టుకునే సిద్ధం చేసిన కథ అన్నమాట?

మొదట ఆయనతో సినిమా అనుకునే కథ రాయడం ఆరంభించా. అయితే ఆయన ఎక్కడా నా కథని ప్రభావితం చేయకూడదు, అదే సమయంలో ఆయన ఇమేజ్‌కి భంగం కలగకూడదనే అంశాల్ని దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశా. సినిమా చూసినప్పుడు ఆయన కోసమే పుట్టిన కథనా? ఈ కథ కోసమే ఆయన ఇందులోకి వచ్చారా? అనేది చెప్పలేని విధంగా, అందంగా కథ, పాత్రలు మిళితమయ్యాయి. ఒక రకంగా ఈ సినిమా కోసం కత్తిమీద సాము చేశా. రెండు భిన్నమైన నేపథ్యాల్ని ఎంచుకొని కథని నడపడం ఓ పెద్ద సవాల్‌గా అనిపించింది. ధర్మస్థలి అనే దేవాలయ నగరి, మరొకటి నక్సలిజం నేపథ్యం. సంబంధం లేని రెండు ప్రపంచాల్ని కలిపే ఆ ఆలోచనే నన్ను ఎంతో ఆత్రుతకి గురిచేసింది. నడిచే బాటలు వేరైనా ధర్మం ముఖ్యం అనే అంశం ఈ కథలో ప్రధానం. ప్రాచీన దేవాలయం ఉన్న ధర్మస్థలి అనే ఊరికి ఓ పెద్దాయన వచ్చి స్థిరపడితే ఎలా ఉంటుందనేది ఈ కథలో ప్రధానమైన అంశం. ఓ సినిమా చేసేటప్పుడు సవాళ్లు ఎదురైనప్పుడే ఆ ప్రయాణం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇది చూస్తున్నప్పుడు ప్రేక్షకులకి తండ్రి, తనయుడు కనిపించకూడదు, అవొక రెండు అద్భుతమైన పాత్రలే అనిపించాలి. అందుకోసం బాగా కష్టపడ్డాం.

మొదట్లో రామ్‌చరణ్‌ అతిథి పాత్రలోనే కనిపిస్తారన్నారు. తర్వాత పూర్తిస్థాయిలోకి మారింది కదా?

ఆయనది నిడివిగల పాత్రే. నేను ఏ పాత్రనైనా నమ్మి, ఆరాధించి రాస్తానే తప్ప కొలతలేసుకుని రాయను. ఇక్కడ ఎంత నిడివితో కనిపిస్తుందనేది ముఖ్యం కాదు, ఎంత ప్రభావవంతంగా ఉంటుందనేదే కీలకం. రామ్‌చరణ్‌ చేసిన సిద్ధ పాత్ర, ఆ ప్రయాణం కథపైనా, ప్రేక్షకులపైనా చాలా ప్రభావం చూపిస్తుంది.

సామాజికాంశాల కథలకు... కథానాయకుల ఇమేజ్‌తోపాటు వాణిజ్యాంశాల్ని అందంగా మేళవిస్తుంటారు. తొలి సినిమా నుంచే ఆ విషయంలో పట్టు ప్రదర్శించడం మొదలు పెట్టారు. అదెలా సాధ్యమైంది?

సామాజికాంశాలు, సందేశాల్ని దృష్టిలో పెట్టుకుని నేను కథలు చెప్పను. ఒక మంచి వ్యక్తీకరణ, ఓ బలమైన భావోద్వేగాన్ని తెరపై ఆవిష్కరించాలనుకుంటాను తప్ప సమాజాన్ని ఉద్ధరించాలని సందేశాల్ని మేళవిస్తూ ఎప్పుడూ కథలు రాసుకోను. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు భావోద్వేగాన్ని అనుభూతి చెందాలనేదే నా లక్ష్యం. హీరో ఊరిని దత్తత తీసుకోవడం అనేది ఓ భావోద్వేగమే తప్ప, దాన్ని సందేశం అనుకోను. ప్రమాణం చేశాను, దానికి కట్టుబడి ఉంటానని ఓ హీరో చెప్పేది అతని భావోద్వేగమే తప్ప సందేశం అనుకోను. ఒకవేళ అక్కడొక బలమైన సందేశం పుట్టి, అది పదిమందికి స్ఫూర్తిగా నిలిచిందంటే బోనస్‌గా పరిగణిస్తానంతే.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తున్న రామ్‌చరణ్‌ సినిమా కదా, దీన్ని పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళతారా? ఈ మార్కెట్‌పై ఓ దర్శకుడిగా మీ అభిప్రాయం ఏమిటి?

పాన్‌ ఇండియా అనే పదం ఎందుకో నాకు నచ్చదు. మన దేశంలో ఎప్పుడూ ఇలాంటి సినిమాలే వచ్చాయి. కాకపోతే ఒకప్పుడు ఒక భాషలో ఓ సినిమా బాగా ఆడిందంటే దాని హక్కులు కొనుక్కుని అదే కథని వేరే నటులతో తీసేవాళ్లు. మన కథలు అలా పొరుగు భాషల్లోకి వెళ్లేవి. ఏ భాషలోనైనా అందరం చూసేవి అవే కథల్నే. కాకపోతే ఎక్కడ తీసినా ఆ సినిమానే అన్ని భాషల్లోనూ చూసే వాతావరణం, మార్కెట్‌ సౌలభ్యం ఏర్పడింది. దర్శకుడిగా మన కథలు అందరికీ నచ్చుతున్నాయనే సంతోషం ఉంది. మంచి కథకులు ఉన్నారిక్కడ అని చాటుకోవడంతోపాటు, మన సినిమా మరో స్థాయికి వెళ్లడం మనందరికీ సంతోషాన్నిచ్చే విషయమే. ఇక ‘ఆచార్య’ని ఏ స్థాయికి తీసుకెళతారనేది నిర్మాతకి సంబంధించిన విషయం.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌తోనూ మీరే సినిమా చేస్తున్నారు. అదీ పాన్‌ ఇండియా మార్కెట్‌ లక్ష్యంగానే రూపొందుతోందా?

మంచి కథే రాశా. ఎక్కువ మంది చూడాలనే రాస్తాం తప్ప తెలుగు ప్రేక్షకుల కోసమైతే ఓ కథ, పాన్‌ ఇండియా మార్కెట్‌ కోసమైతే మరో కథ అనేదేమీ ఉండదు. పెద్ద, బలమైన కథని రాస్తే సహజంగానే అందరూ చూస్తారు. ఆ సినిమా గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడను. ప్రస్తుతానికి పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జూన్‌ నుంచి చిత్రీకరణ కోసం వెళ్లనున్నాం.

తొలిసారి చిరంజీవితో ప్రయాణం ఎలా అనిపించింది?

కళ్ల ముందు మెగాస్టార్‌ ఉన్నాడనేది, ఆయనతో సినిమా చేస్తున్నామనేదే దర్శకుడు సాధించిన ఓ పెద్ద లక్ష్యం. ఆ ఉత్సాహంతోనే చాలా రోజులు ప్రయాణం చేశా. అందులో ఓ చిన్నపాటి భయమూ ఉంటుంది. ఆ విషయం చిరంజీవికి తెలుసు. వీళ్లంతా మెగాస్టార్‌తో ఎలా అనే ఒక రకమైన భయంతో ఉంటారని... ఆరంభంలోనే నువ్వు దర్శకుడు, నేను నటుడు అనే అభిప్రాయం కలిగేలా చేస్తారు. ఆయన బలం అది. ప్రయాణాన్ని సున్నితంగా మార్చేస్తారు. యువ హీరోలతో నాకు ఎంత అనుబంధం ఉండేదో, అదే తరహా వాతావరణంలోనే ‘ఆచార్య’ పూర్తి చేశా.

పుస్తక పఠనం మొదట్నుంచీ ఉన్న ఓ అలవాటు. ఈమధ్య ప్రత్యేకంగా జీవిత చరిత్రలు చదువుతున్నా. మనుషులు, వాళ్ల జీవితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నా. జీవిత చరిత్రలనగానే ప్రముఖులే గుర్తుకొస్తారు. కొంతమంది ఐఏఎస్‌ అధికారులు, న్యాయమూర్తులు వాళ్ల జీవిత అనుభవాలతో పుస్తకాలు రాస్తుంటారు. అలాంటివన్నీ చదువుతున్నా. వాళ్ల కోణాల్లో వాళ్ల అనుభవాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటా. మారుమూల రాష్ట్రాల్లో ఎంతో చిత్తశుద్ధితో పనిచేసిన ఓ పోలీస్‌ అధికారి కథ మనకు తెలిసి ఉండకపోవచ్చు, ఎక్కడో ఓ యోగి కథ మనకు తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ల జీవితాల్లో జరిగే ఆసక్తికరమైన కథలు, వాళ్ల నిర్ణయాలు చదువుతున్నప్పుడు కొన్ని భలే ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. మనకు తెలియని ఇన్ని కథలు, ఇన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయా అనిపిస్తుంది. లాక్‌డౌన్‌ సమయంలో కొన్ని ఆలోచనల్ని రాసుకున్నా. నా గురించి పుస్తకం రాసుకునే ఆలోచనైతే ఏదీ లేదు. అదృష్టవశాత్తూ మనకు అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా మన అనుభవాలన్నీ ఎప్పటికప్పుడు చెప్పేస్తుంటాం కదా!

సామాజిక మాధ్యమాల్లో మొదట్నుంచీ నేనంత చురుకేమీ కాదు. ఎందుకో అదనంగా ఓ బ్యాగేజ్‌తో ఉన్నట్టు అనిపించేది. అందుకే ట్విటర్‌ నుంచి బయటికి వెళ్లిపోయా. అంతే తప్ప దాని వెనక ప్రత్యేకంగా కారణాలంటూ ఏమీ లేదు. సామాజిక అనుసంధాన మాధ్యమాలు నిజంగా మనకు అందుబాటులో ఉన్న గొప్ప వేదికలు. ఇలాంటి వేదికల్లో మంచితోపాటు చెడూ ఉంటుంది. ఆ చెడుని ఎంత తగ్గించుకుని వాడితే అంత మంచిది. సోషల్‌ మీడియా దాకా వచ్చామంటే మనమంతా ఎంతో కొంత చదువుకునే ఉంటాం. నలుగురితో ఎలా వ్యవరించాలో తెలిసే ఉంటుంది. అందుకు తగ్గట్టే మసలుకోవాలి. మీమ్స్‌ చూడండి, ఎంత బాగుంటాయి. అలా జీవితంలో ఫన్‌ ఉండాలి కానీ, ద్వేషం... ప్రతికూల ఆలోచనలు అనవసరం అనేది నా అభిప్రాయం. మంచి కథలు, నచ్చిన కాన్సెప్టులతో సినిమా నిర్మాణం చేపట్టాలనేది నా ఆలోచన. భవిష్యత్తులో ఎక్కువ సినిమాలు నిర్మిస్తా. కథలు వింటూ ఉన్నా".

ఇదీ చూడండి:'భలే భలే బంజారా' ప్రోమో అదుర్స్- 'అర్జున కల్యాణం' కొత్త డేట్​ ఫిక్స్​

ABOUT THE AUTHOR

...view details