Devara Movie Glimpse :టాలీవుడ్ స్టార్ హీరోజూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ 'దేవర'. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ మూవీ గురించి అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ గ్లింప్స్‌ను నెట్టింట విడుదల చేశారు. ఆద్యంతం ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్‌లో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అలా ఈ వీడియో సినీ లవర్స్‌లో అంచనాలు అమాంతం పెంచేస్తోంది. ముఖ్యంగా ఇందులోని రక్తపు సముద్రం సీన్‌తో పాటు మూన్ ఫైట్ సీన్ అభిమానులకు తెగ నచ్చింది. చివరిలో దేవర డైలాగ్ కూడా అంచనాలకు మించి అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
ఇటీవలే డెవిల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నిర్మాత, జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఓ సందర్భంలో దేవర గురించి ప్రస్తావన రాగా, ఫ్యాన్స్ అంచనాలు మించేలా ఈ సినిమా రూపొందుతుందంటూ కల్యాణ్ రామ్ హింట్ ఇచ్చారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందన్న ఆయన, తాజా అప్డేట్ గురించి ఫ్యాన్స్ అడుగుతుంటే ఒత్తిడి కలుగుతుందన్నారు. అయినప్పటికీ వీలైనంత త్వరగా అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతామంటూ వెల్లడించారు.