టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి తారకరత్న(40) తుదిశ్వా విడిచారు. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తారకరత్న పార్థివదేహాన్ని హైదరాబాద్ తరలించనున్నారు. ఆదివారం హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తారకరత్న మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. తారకరత్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తారకరత్న మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి కూడా సంతాపం తెలిపారు.
ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోవడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తారకరత్న కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పవన్ కల్యాణ్ ట్వీట్ చేస్తూ.. "గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకుంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకున్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే కన్నుమూయడం దురదృష్టకరం. తారకరత్న భార్యాపిల్లలకు, తండ్రి మోహనకృష్ణ, బాబాయి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని అన్నారు.
అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ట్విటర్లో సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీపీసీసీ రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.
ఇదీ చూడండి:తారకరత్న.. లవర్ బాయ్ టు స్టైలిష్ విలన్గా..