Chandramukhi 2 Flop : నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రీసెంట్గా 'చంద్రముఖి 2' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ విషయంపై రాఘవ లారెన్స్ మాట్లాడారు. హిట్, ఫ్లాప్‌ల గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఎస్‌జే సూర్యతో కలిసి లారెన్స్ నటించిన కొత్త పీరియాడిక్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ జిగర్ తండ డబుల్ ఎక్స్. నిమేషా సజయన్, షైన్ టామ్ చాకో తదితరులు ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్లో లారెన్స్ మాట్లాడారు. ఈ మీటింగ్‌లోనే చంద్రముఖి 2 ఫ్లాప్ గురించి రియాక్ట్ అయ్యారు.
"చంద్రముఖి 2 విషయంలో నా డబ్బులు నాకు వచ్చేశాయి. పైగా నలుగురు హీరోయిన్స్‌తో కలిసి యాక్ట్ చేశాను. జీవితంలో అన్నీ మనం గెలవాలని లేదు కదా. గ్రూప్ డ్యాన్సర్ నుంచి డ్యాన్సర్ మాస్టర్ అయితే చాలని భావించాను. అక్కడి నుంచి దర్శకుడిగా మారాను. ఇప్పుడు హీరో అయ్యాను. ఈ గ్లామర్‌తో హీరో అవకాశాలు ఇవ్వడమే దేవుడిచ్చిన పెద్ద వరం. మళ్లీ అందులో ఫ్లాప్, హిట్‌లు గురించి ఆలోచించకూడదు. అవి మన వెనకాలే వస్తాయి. 'జిగర్తాండ్ డబుల్ ఎక్స్' డబ్బింగ్ పూర్తయ్యాక చూశాను. ఇది డైరెక్టర్ సినిమా. ఇందులో మంచి స్టోరీ ఉంది. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఎంత పెద్ద హీరోయిజం చేసినా, డ్యాన్స్ చేసినా కథ లేకపోతే, సినిమా ఆడదు. కంటెంట్ బలంగా ఉండాలంటే దర్శకుడు కూడా అంతే బలంగా ఉండాలి. కార్తీక్ సుబ్బరాజు విషయంలో నాకు ఎలాంటి డౌట్స్ లేవు" అని పేర్కొన్నారు.
మనశ్శాంతి ఉండటం లేదు!.. 'కాంచన 4' ఎప్పుడు చేస్తున్నారు? అని ప్రశ్నించగా, 'అన్నీ దెయ్యాల సినిమాలు తీసి, నా మైండ్ పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అలాంటి సినిమాలు తీస్తున్న సమయంలో నిద్రపోయినా కూడా అవే ఆలోచనలు వస్తున్నాయి. మనశ్శాంతిగా ఉండటం లేదు. ఏదో ఒక రోజు చేస్తాను' అంటూ బదులిచ్చారు.