'సైరాట్' చిత్రంలో ప్రిన్స్ దాదా పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూరజ్ పవార్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగా అతడిని విచారించనున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.
ఇదీ జరిగింది.. నిరుద్యోగులకు మహారాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గురు నిందితులను అహ్మదానగర్ పోలీసులు సెప్టెంబర్ 9వ అరెస్టు చేశారు. నిందితులు సచివాలయం ఫేక్ ఆర్డర్లు తయారు చేశారని.. దాడులు చేసి వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాడులు చేసినప్పుడు మూడు ఫోర్జరీ చేసిన జాయినింగ్ ఆర్డర్లు, స్టాంపులు, సీల్లు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
అయితే విచారణలో భాగంగా నిందితులు.. తాము నకిలీ స్టాంపులు, సీల్లు తయారు చేయాడానికి సూరజ్ పవార్ సహాయం చేశాడని చెప్పారని పోలీసులు తెలిపారు. సినిమా కోసం స్టాంపులు కావాలని.. నిందితులు వాటిని తయారు చేయించుకున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే దొరికిన సాక్ష్యాల ఆధారంగా.. సూరజ్ పవార్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడని వెల్లడించారు.