తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విశ్వనాథ్​ వేసుకునే ఖాకీ దుస్తుల వెనకున్న కథ ఏంటంటే? - దర్శకుడు కె విశ్వనాథ్​ ఖాకీ డ్రెస్​

ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి, ఆహార్యం ఉంటాయి. లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మెగాఫోన్‌ పడితే ఒంటిపై ఖాకీ దుస్తులు ఉండాల్సిందే. ఎందుకంటే?

k viswanath
k viswanath in khakee

By

Published : Feb 3, 2023, 10:48 AM IST

ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి, ఆహార్యం ఉంటాయి. కోడి రామకృష్ణ తలకు క్లాత్‌ కట్టుకుంటారు. రాఘవేంద్రరావు దాదాపు గడ్డంతోనే కనిపిస్తారు. షూటింగ్‌ జరిగినన్ని రోజులు రాజమౌళి కూడా పరిస్థితి కూడా దాదాపు అంతే. అయితే లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మాత్రం మెగాఫోన్‌ పడితే ఒంటిపై ఖాకీ దుస్తులు ఉండాల్సిందే. దీని గురించి ఓ సందర్భంగా కె.విశ్వనాథ్‌ స్వయంగా పంచుకున్నారు.

"సెట్‌లో ఖాకీ యూనిఫామ్‌ది చాలా పెద్ద కథ. సౌండ్‌ రికార్డిస్ట్‌గా ఉండి దర్శకుడ్ని అయినవాడ్ని. ఓ రకంగా తలబిరుసు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నవాడ్ని. ఎమ్మెల్యే అయినవాడు మంత్రి అవ్వాలనుకుంటాడు. మంత్రి అయినవాడు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటాడు. సినిమాల్లోనూ అంతే. ఏ విభాగంలో అడుగుపెట్టినా.. చిట్టచివరి లక్ష్యం దర్శకుడి కుర్చీనే. అలాంటి కుర్చీ నాకు దక్కితే కళ్లు నెత్తికెక్కే ప్రమాదం ఉంటుంది కదా? ఆ అవకాశం ఇవ్వకూడదనుకున్నా. దర్శకుడ్ని అయిపోగానే తెల్ల ప్యాంటూ, తెల్ల చొక్కా, తెల్ల బూట్లూ, మెళ్లో గొలుసులూ వేసుకుని హడావుడి చేయడం నాకిష్టం లేదు. నేనూ అందరిలానే మామూలు మనిషిలాగానే ఉండాలనుకున్నా. నిజాయతీగా చేసిన ప్రయత్నం. నా సెట్లో పనిచేసే పెయింటర్స్‌, లైట్‌బాయ్స్‌, హెల్పర్స్‌.. అందరికీ ఖాకీ దుస్తులే. కాకపోతే వాళ్లకు నిక్కరు, నాకు ప్యాంటు అంతే తేడా. 'మీరు ఖాకీ డ్రస్సు వేసుకోవడం ఏమిటండీ..' అని మా ఆర్ట్‌ డైరెక్టర్‌ తెగ గొడవ పడేవాడు. 'మొదటి సినిమా సరిగా ఆడకపోతే.. వెంటనే టాక్సీ డ్రైవరుగా మారిపోతా. అప్పుడు కుట్టించుకోవడానికి వీలు ఉంటుందో లేదో.. ఓ జత రెడీ ఉన్నట్టుంటుంది’ అని చెప్పా! అది దొంగ మాటే అయినా.. అందులో కొంత నిజం లేకపోలేదు. తొలి సినిమా రోజుల్లో చాలా భయం ఉండేది. నాకు తెలిసిన పాత్రికేయులు ‘మీ సినిమా కోసం రాస్తాం' అంటుంటే.. 'మొదటి సినిమాకి ఏం రాయొద్దు. ఎందుకంటే నా సినిమా తుస్సుమంటే మీరేం రాసినా ఉపయోగం ఉండదు. రెండు, మూడు సినిమాలు తీశాక, నాలో ప్రతిభ ఉంది అనిపిస్తే రాయండి' అనేవాడ్ని"

స్వయం కృషి షూటింగ్​లో ఖాకీ దుస్తుల్లో కళా తపస్వీ

118 ఏళ్లు బతకాలనుకోవాలట..
జీవితం అంటే మరేదో కాదు.. జీవించడమే. ఇప్పుడు నా జీవితం గురించి నేను ఆలోచించినా, ఆలోచించకపోయినా.. ఓ భయం మాత్రం ఉంటుంది. అది మరణం గురించే. ఇలాంటి భయాలు ఉండకూడదు అని నాతో చాలా మంది చెప్పారు. ఎవరైనా సరే.. 118 ఏళ్లు బతుకుతాం అనుకోవాలట. 118వ పుట్టిన రోజున ఏం బట్టలు వేసుకోవాలి? ఎవర్ని పిలవాలి? కేక్‌ ఎలా కట్‌ చేయాలి? అనే ఆలోచనలతో బతకాలట. 90 ఏళ్లకు వచ్చేశాం.. మొత్తం జీవితం అయిపోయింది అనుకోకూడదట. పిల్లలు సెటిలైపోయారు. వాళ్ల గురించి బెంగ లేదు. ఈ వయసులో బెంగలు విచిత్రంగా ఉంటాయి. ముని మనవడికి ఏమైనా అయితే.. మనసు తట్టుకోలేదు. వాళ్లకు జ్వరం వస్తే ధ్యాసంతా అటే ఉంటుంది.

సాగర సంగమం షూటింగ్​లో ఖాకీ బట్టల్లో కె విశ్వనాథ్​

ABOUT THE AUTHOR

...view details