తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అసలు 'వాల్తేరు' పేరెలా వచ్చింది..? చిరంజీవి సినిమాకు ఆ పేరే ఎందుకు పెట్టారు? - వాల్తేర్ వీరయ్య టైటిల్ స్టోరీ

సంక్రాంతికి రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉన్న చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య టైటిల్​ వెనుక ఓ నోస్టాలజిక్​ కథ ఉందని దర్శకుడు బాబీ వివరించారు. మరోపైవు అసలు వైజాగ్​లోని వాల్తేరు గ్రాామానికి ఆ పేరు ఎలా వచ్చిందో దానికి వీరయ్య సినిమాకు ఏదైనా లింక్​ ఉందా అన్న విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

waltair veerayya
waltair veerayya

By

Published : Jan 11, 2023, 10:02 AM IST

విశాఖపట్నం ఏర్పడక ముందే ఉన్న పురాతన గ్రామాల్లో పెదవాల్తేరు ఒకటి. పూరి గుడిసెలతో ఓ చిన్న గ్రామంగా ఉండేది. డాబాలు, బహుళ అంతస్థులు ఉన్నా, ఇప్పటికీ గ్రామీణ వాతావరణంలానే అనిపిస్తుంది. వాల్తేరుకు ఒక పక్క లాసన్సుబే కాలనీ, మరో పక్క ఎంవీపీ కాలనీ, ఉషోదయా, ఇందిరానగర్‌ సరిహద్దులుగా ఉంటాయి. పోలమాంబ అమ్మవారిని ఇక్కడి వారు ఇలవేల్పుగా కొలుస్తారు.

ప్రధానంగా పెదవాల్తేరు అనే పేరు రావడానికి కారణం ఈ ప్రాంతం వాలుగా ఉండటం కారణంగా పేరు వచ్చిందని శాస్త్రీయంగా నామకరణం చేశారు. అయితే పక్కనే ఉన్న చిన్నవాల్తేరు వాలు తక్కువగా ఉంటుంది. వాలు ఎక్కువగా ఉండటం ద్వారా ఈ ప్రాంతానికి పెదవాల్తేరుగా, చిన్నవాలు ప్రాంతానికి చినవాల్తేరుగా పిలుస్తారు. దీంతో పాటు మరో కథ కూడా చెబుతున్నారు. ఇద్దరు రజకులు ఉండేవారు. అయితే అన్న ఉండే ప్రాంతానికి పెదవాల్తేరుగా, తమ్ముడు ఉండే ప్రాంతానికి చినవాల్తేరుగా పేరు వచ్చిందని కొంత మంది స్థానికులు చెబుతారు. బ్రిటిష్‌వాళ్లు పరిపాలించే సమయంలో విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు వాల్టైర్‌గా పేరు ఉండేది. వాల్టైర్‌ కొన్నాళ్లకు వాల్తేరుగా మారిందట.

మరొక కథనం ప్రకారం..
వాల్తేరు అనేది ప్రజలు తాగేందుకు నీరు ఇచ్చిన సెలయేరుగా చెబుతారు. తూర్పు కనుమల్లో పుట్టిన రెండు పెద్ద నీటి ప్రవాహాలు విశాఖ మీదుగా ప్రవహించేవి. అందులో ఒకటి హనుమంత వాగు. ఇది సింహాచలం కొండల్లో పుట్టి లాసన్స్‌బే వద్ద సముద్రంలో కలిసేది. 1902లో ముడసర్లోవ పార్కు/రిజర్వాయరు నిర్మించిన తరువాత ఈ యేరు కనుమరుగైంది. ఇప్పటి హనుమంతవాక జంక్షన్ ఆ వాగు పేరు మీదుగానే వచ్చిందంటారు. ఇంకొకటి వాలుతేరు/వాలుటేరు. తూర్పు కొండల్లో పుట్టి విశాఖ నగరం మీదుగా 30 కి.మీ. ప్రవహించి, డాల్ఫిన్ నోస్ కొండ వద్ద సముద్రంలో కలిసేది.

వాల్తేరు పోలమాంబ అమ్మవారి సన్నిధి

వాలుగా ప్రవహించే ఏరు (వాలు+ఏరు) వాలుతేరు క్రమంగా వాల్తేరుగా రూపాంతరం చెందిందని అంటారు. వందల ఏళ్ల క్రితమే డాల్ఫిన్ నోస్ వద్ద వాల్తేరు ఓడరేవు విదేశీయులకు గమ్యస్థానం. డచ్‌, ఫ్రెంచ్, బ్రిటీష్ వాళ్ళు ఈ ఓడరేవు తమ సరకులు రవాణా చేసేవారు. 1850 తర్వాత బ్రిటీష్ వాళ్లు సెంట్రల్‌ ప్రావిన్స్‌ పోర్ట్‌, ఈస్ట్‌కోస్ట్‌ బెటాలియన్‌, వైజాగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిస్ట్రిక్ట్‌, వాల్తేర్‌ ఈస్ట్‌ రైల్వేస్టేషన్‌ ప్రారంభించడంతో బ్రిటీష్ అధికార్ల రాకపోకలు పెరిగాయి.

డాల్ఫిన్ నోస్ వద్ద వాల్తేరుకు ప్రాచుర్యం పెరిగింది. ఆంగ్లేయులు వాల్తేరును 'వాల్టేర్‌' అని పలకడం.. Waltairగా రాయడం అలవాటై అదే కొనసాగింది. పూర్వం వాల్తేరు-పెద జాలరిపేట మధ్య ప్రాంతమంతా ఎక్కువగా కొండగుట్టలు మాత్రమే ఉండేవట. వీటిని విస్తరించుకుంటూ రావడంతో రెండు విడిపోయి, పెద వాల్తేరు, చిన వాల్తేరు అయ్యాయి. నగరానికి నీటి అవసరాలు పెరగడంతో 1970లో వాల్తేరుపై మేఘాద్రి గెడ్డ వద్ద జలాశయం నిర్మించారు. దీంతో వాల్తేరు ప్రవాహం నిలిచిపోయింది.

ఇక ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' టైటిల్‌ వెనుక కథ చూద్దాం!
చిరంజీవి కథానాయకుడిగా బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వాల్తేరు వీరయ్య'. శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ పెట్టడం వెనుక కథను దర్శకుడు బాబీ ఇటీవల వెల్లడించారు.

"వెంకీ మామ షూటింగ్ యాగంటిలో జరుగుతున్నప్పుడు నాజర్ గారు ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్‌తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముందు బాపట్లలో ఉన్నారు. అప్పుడు ఆయన నాన్నగారు ఓ హెడ్ కానిస్టేబుల్‌కు రూ.500 ఇచ్చి ఫొటో షూట్ చేయించారు. ఆ ఫొటోలతోనే మద్రాస్ వచ్చానని చిరంజీవి గారు చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. ఇది చాలా నోస్టాలిజిక్‌గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బాగుంటుందని అనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చింది. అలా వాల్తేరు వీరయ్యని లాక్ చేశాం" అని బాబీ చెప్పారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి మాస్‌, యాక్షన్‌ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details