Balakrishna Vs Ravteja :టాలీవుడ్లో దసరా బాక్సాఫీస్ సీజన్ దగ్గరపడుతోంది. సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి బరిలోకి దిగినప్పుడు ఎవరు పైచేయి సాధిస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇప్పుడు దసరా బాక్సాఫీస్ అదే ఉత్కంఠతను ప్రేక్షకుల్లో క్రియేట్ చేస్తోంది. ఈ సారి నందమూరి నటసింహం బాలకృష్ణ - మాస్ మహారాజా రవితేజ పోటీ పడనున్నారు.
అసలీ దసరా పండగకు నాలుగు సినిమాలు ఒకేసారి థియేటర్లలో విడుదల కానున్నాయి. టాలీవుడ్ నుంచి బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, హిందీ చిత్రం టైగర్ ష్రాఫ్ గణపత్, దళపతి విజయ్ వలియో రిలీజ్ అవుతున్నాయి. అయితే టాలీవుడ్ ప్రేక్షకులు.. భగవంత్ కేసరి వర్సెస్ టైగర్ నాగేశ్వరరావు పోటీగానే చూస్తున్నారు. బాలయ్య - రవితేజ గతంలో పోటీపడ్డ ట్రాక్ రికార్డ్ వివరాలను బయటకు తీసి తిరగేస్తున్నారు.
2008 సంక్రాంతి బరిలో బాలయ్య 'ఒక్క మగాడు' చిత్రంతో కాస్త నిరాశపరచగా.. రవితేజ 'కృష్ణ' చిత్రంతో వచ్చి భారీ సక్సెస్ను అందుకున్నారు. 2009లో బాలయ్య 'మిత్రుడు' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించగా.. రవితేజ 'కిక్' సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ సక్సెస్ను అందుకున్నారు. 2011 సంక్రాంతికి 'పరమవీర చక్ర' చిత్రంతో బాలయ్య ఆకట్టుకోకపోగా.. 'మిరపకాయ'తో వచ్చిన రవితేజ భారీ విజయాన్ని దక్కించుకున్నారు. అలా మూడు సార్లు బాలయ్యపై రవితేజనే సక్సెస్ అందుకున్నారు.