Balakrishna Veerasimha Reddy Movie: సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతోంది 'వీరసింహారెడ్డి' చిత్రం. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్ కథానాయిక. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మిగిలి ఉన్న చిత్రీకరణను చకచకా పూర్తి చేస్తోంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో గురువారం ఓ కీలక షెడ్యూల్‌ను ప్రారంభించారు.
ఇందులో భాగంగా బాలకృష్ణ.. విలన్ గ్యాంగ్‌కు మధ్య ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. దీనికి వెంకట్ మాస్టర్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రతినాయకుడిగా దునియా విజయ్ నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: రిషి పంజాబీ.