తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమనేది చాలా పెద్ద బాధ్యత' - వేదా ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో బాల కృష్ణ స్పీచ్​

కన్నడ స్టార్​ శివరాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'వేద'. కన్నడలో హిట్​ కొట్టిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజవ్వనుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ అతిథిగా హాజరై మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం

vedha pre release event
balakrishna and shiv raj kumar

By

Published : Feb 8, 2023, 6:38 AM IST

దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ స్థానం పునీత్‌దేనని, ఆయన స్థాయి ఆయనదేనని నందమూరి బాలకృష్ణ అన్నారు. 'వేద' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్‌ హీరోగా దర్శకుడు హర్ష తెరకెక్కించిన సినిమా ఇది. కన్నడలో గతేడాది విడుదలై విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో ఈ నెల 9న రాబోతుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ ముఖ్యఅతిథిగా చిత్రబృందం హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహించింది.

వేడుకనుద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ.. "శివరాజ్‌కుమార్‌ సతీమణి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఆమెను అభినందిస్తున్నా. 'భజరంగి 1', 'భజరంగి 2', 'వజ్రకాయ' తర్వాత శివరాజ్‌కుమార్‌తో దర్శకుడు హర్ష తెరకెక్కించిన చిత్రమిది. కన్నడలో విజయాన్ని అందుకుంది. ఇక్కడి ప్రేక్షకులనూ అలరిస్తుందనుకుంటున్నా. ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకుంటేనే మంచి కథలు వస్తాయి. 'నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్లే అన్నట్టు నేను చెప్పిందే కథ' అనుకుంటే మంచి సినిమాలు రావు. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమనేది చాలా పెద్ద బాధ్యత. శివరాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌లు.. రాజ్‌కుమార్‌ వారసత్వాన్ని కొనసాగించారు. పునీత్‌ మన మధ్య లేకపోయినా ఎప్పుడూ ఆయన స్థానం ఆయనదే.. ఆయన స్థాయి ఆయనదే. 'మేం అది చేస్తున్నాం. ఇది చేస్తున్నాం' అని మనం చెబుతుంటాం. కానీ, ఎలాంటి ఆర్భాటం లేకుండా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు" అని బాలకృష్ణ గుర్తు చేశారు.

పాట కాదు.. సినిమా చేయాలనుంది: శివరాజ్‌కుమార్‌
"బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో నేను ఓ పాటలో నటించా. ఆయనతో కలిసి ఓ పెద్ద సినిమా చేయాలనుంది. మా కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణ నా సోదరుడిలాంటి వారు. ఇదే కాదు బెంగళూరు జరిగే నా చిత్ర వేడుకలకు ఆయన వస్తుంటారు. ఆయన ఆహ్వానం మేరకు నేను గతంలో నిర్వహించిన లేపాక్షి ఉత్సవాల్లో పాల్గొన్నా. ఈ సినిమా కన్నడ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. మీకూ నచ్చుతుందనుకుంటున్నా. ఇందులో సందేశంతోపాటు వినోదం ఉంది. ఇకపై తెరకెక్కే నా సినిమాలను కన్నడలో రిలీజ్‌ చేసిన రోజే ఇక్కడా విడుదల చేస్తా" అని శివరాజ్‌కుమార్‌ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details