Hero Balakrishna New Movie NBK 108: స్పీడుగా సినిమాలు చేయడం నటసింహం నందమూరి బాలకృష్ణ స్టైల్. ఒక్కసారి ఆయన కమిట్ అయ్యారంటే.. వెనక్కి తిరిగి చూసేది ఉండదు. చకచకా సినిమా పూర్తి చేస్తారు. గత ఏడాది చివర్లో 'అఖండ'తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఏడాది సంక్రాంతి, ఆ తర్వాత కూడా ఆ సినిమా థియేటర్లలో ఆడింది. దాని తర్వాత రెండు సినిమాలకు బాలకృష్ణ ఓకే చెప్పారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. మరో సినిమాను నవంబర్‌లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారట.
నవంబర్‌లో సెట్స్ మీదకు NBK 108
బాలకృష్ణ కథానాయకుడిగా షైన్ స్క్రీన్స్ పతాకంపై NBK 108(వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు హరీశ్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు కాగా.. బాక్సాఫీస్ బరిలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకుడు. నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం.
టర్కీలో శ్రుతిహాసన్‌తో సాంగ్ షూట్..
గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కోసం ఆగస్టు నెలాఖరులో బాలకృష్ణ టర్కీ వెళ్లారు. ఇస్తాంబుల్‌లో శ్రుతి హాసన్‌తో ఒక పాట, విలన్లతో ఒక ఫైట్, కొన్ని కామెడీ సీన్లు చేశారు. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత 'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్ కోసం టీజర్, ట్రైలర్ షూటింగ్ పూర్తి చేశారు. త్వరలో ఎపిసోడ్స్ షూటింగ్ కూడా చేస్తారట. అవి పూర్తైన తర్వాత 'ఎన్‌బీకే 108' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.