Balakrishna Anil ravipudi movie: తెలుగు చిత్ర పరిశ్రమలో పట్టాలెక్కనున్న క్రేజీ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ ఒకటి. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కుతుందని కొద్ది కాలం క్రితమే అనిల్ స్పష్టం చేశారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మాస్, క్లాస్ కథ ఏదైనా బాలకృష్ణ తనదైన శైలిలో నటించగలరు. ఇక మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాలను తీయడంలో తనకు తానే సాటి అని 'సరిలేరు నీకెవ్వరు'తో అనిల్ నిరూపించుకున్నారు.
మరి బాలయ్యను ఎలా చూపిస్తారోనని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ దీనిపై స్పందించారు. "బాలకృష్ణను ఎలా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారో, అలా చూపించాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. నా మార్క్ ఎంటర్టైన్మెంట్ ఎలాగో ఉంటుంది. అయితే ఇంతకముందులా ఎక్కువ కామెడీ మాత్రం ఉండదు. బాలయ్య ఇమేజ్‌కి భిన్నంగా వెళ్లకుండా ఓ డిఫరెంట్ జోనర్లో ఈ కథను నడిపించాలని అనుకుంటున్నాను. ఆయన పాత్రను కొత్తగా ఎలా డిజైన్ చేయాలి? లుక్.. మాట్లాడే స్టైల్.. బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతీదానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఇది వర్కౌట్ అయితే తప్పకుండా ఈ చిత్రం ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుంది" అని అన్నారు.