యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'అవతార్2' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ విజువల్ వండర్‌గా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన సంగతి తెలిసిందే. తొలి భాగంలో పండోరా అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన కామెరూన్.. ఈ సారి సీక్వెల్‌తో నీటి అడుగున అందాలు, భారీ జలచరాలతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. దాదాపు రూ.3వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. విజువల్స్ పరంగా సినిమా అద్భుతంగా ఉందని సినీ ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా తొలి కలెక్షన్స్ గురించి వివరాలు బయటకు వస్తున్నాయి. సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా(రెండు రోజుల్లో) రూ.300కోట్లు వరకు వసూలు చేసిందని అన్నారు. అలానే భారత్‌లో తొలి రోజు రూ.58కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పుకొచ్చారు.
అయితే పలు సినిమా వెబ్సైట్లు ఇచ్చిన ప్రకారం ఈ చిత్రం తొలి రోజు భారత్‌లో రూ.35-38కోట్లు నెట్ వసూలు చేసినట్లు రాశాయి. 2022లో ఇండియన్ బాక్సాఫీస్‌లో తొలి రోజు ఎక్కువ వసూలు చేసిన హాలీవుడ్ చిత్రం ఇదేనని పేర్కొన్నాయి. ఆ తర్వాత డాక్టర్ స్ట్రేంజ్(రూ.28.35కోట్లు), థో లవ్ అండ్ థండర్(18.2కోట్లు), బ్లాక్ ప్యాంతర్(12కోట్లు), జురాసిక్ వరల్డ్(8కోట్లు), బ్లాక్ అడమ్(6.8కోట్లు), ది బ్యాట్మన్(6.66కోట్లు) నెట్ కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి.