చాలాకాలం తర్వాత నాని నటించిన కామెడీ ప్రధాన చిత్రం 'అంటే.. సుందరానికీ!'. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్‌టైనర్ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విశాఖపట్నం వేదికగా గురువారం విడుదల చేసింది. ఈ సినిమాలో ఎంత వినోదం ఉంటుందో ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ చెప్పకనే చెప్పాయి. ఇప్పుడీ ట్రైలర్ అంతకుమించిన వినోదం పంచేలా ఉంది. ఈ ప్రచార చిత్రంలో చూపించిన ప్రతి క్యారెక్టర్ నవ్వుల జల్లు కురిపిస్తోంది. ముఖ్యంగా కథానాయకుడి హావభావాలు చక్కిలిగింతలు పెట్టేలా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో సుందర్‌గా నాని కనిపించనున్నారు. మలయాళ నటి నజ్రియా లీల అనే పాత్ర పోషించింది. నరేశ్, రోహిణి, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి, కూర్పు: రవితేజ గిరిజాల.
రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'విరాటపర్వం'. ఎస్ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా 'విరాటపర్వం' ప్రచారాన్ని మొదలుపెట్టిన చిత్ర బృందం..తాజాగా నగదారిలో పాటను విడుదల చేసింది. సురేష్ బొబ్బిలి సంగీతంలో నరేందర్ రెడ్డి, భరద్వాజ ఈ పాటను రచించగా... వరం ఆలపించారు. చిత్ర కథకు అద్దంపట్టేలా నిప్పు ఉంది నీరు ఉందంటూ సాగే నగదారి పాటలో సాయిపల్లవి రానాతో కలిసి చేసే ప్రయాణాన్ని వివరించారు.