Animal Movie Telugu Review :చిత్రం: యానిమల్; నటీనటులు: రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, సురేశ్ ఒబెరాయ్, త్రిప్తి డిమ్రి, పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, రవి గుప్తా, సిద్ధాంత్ కర్నిక్ తదితరులు; సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్; సంగీతం: విశాల్ మిశ్రా, జాని, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, అషిమ్ కెమ్సన్; నేపథ్య సంగీతం: హర్ష వర్ధన్ రామేశ్వర్; నిర్మాణం: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగ; కథ, కూర్పు, స్క్రీన్‌ప్లే: సందీప్‌రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా, సౌరభ్ గుప్తా; డైరెక్టర్: సందీప్ రెడ్డి వంగా; సంస్థ: టి.సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్; విడుదల: 01-12-2023
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ - సందీప్ రెడ్డి కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'యానిమల్'. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రణ్‌బీర్‌ను సందీప్ ఎంత వైల్డ్‌గా చూపించారంటే..
స్టోరీ ఏంటంటే :
స్వస్తిక్ స్టీల్స్ అధినేత, దేశంలోనే సంపన్న వ్యాపారవేత్త బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) తనయుడు రణ్ విజయ్ (రణ్‌బీర్ కపూర్). ఎవరినైనా సరే ధైర్యంగా ఎదురించే రకం. చిన్నప్పటి నుంచే నాన్నంటే ఎంతో ప్రేమ. కానీ, తన వ్యాపారాల వల్ల బిజీగా గడుపుతున్న బల్బీర్ కొడుకును అస్సలు పట్టించుకోడు. ఇక దూకుడు మనస్తత్వమున్న విజయ్ చేసే పనులు తండ్రి బల్బీర్‌సింగ్‌కి నచ్చవు. ఇద్దరి మధ్యా గొడవలు కూడా మొదలవుతాయి. ఈ నేపథ్యంలో తను ప్రేమించిన గీతాంజలి (రష్మిక)ని పెళ్లి చేసుకుని అతడు అమెరికా వెళ్లిపోతాడు. అయితే కొన్నేళ్ల తర్వాత తండ్రిపై హత్యాయత్నం జరిగిందని తెలుసుకుని హుటాహుటీన తన భార్య, పిల్లలను తీసుకుని ఇండియాకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తన తండ్రిని హత్య చేయాలనుకున్న విలన్‌ను విజయ్ ఎలా గుర్తించాడు? ఇంతకీ ఆ శత్రవు ఎవరు? అతని నుంచి ఆ ఫ్యామిలీని విజయ్ ఎలా కాపాడుకున్నాడనేది తెరపైన చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే:
తండ్రీ కొడుకుల ప్రేమ కథ ఇది. ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా 'అర్జున్ రెడ్'డి పాత్రని సృష్టించిన సందీప్ .. ఇంచు మించు అదే తరహా ఆలోచనలున్న ఓ హీరోను తండ్రీ కొడుకుల కథలోకి తీసుకొస్తే ఎలా ఉంటుందన్నదే ఈ సినిమా. వాస్తవానికి ఇదేం కొత్త కథ కాదు. ఈ తరహా ఎమోషన్స్ అంతకన్నా కొత్తవి కాదు. ఈ స్టోరీ చూస్తే చాలా సినిమాలు గుర్తొస్తాయి. కానీ, డైరెక్టర్ తనదైన శైలి స్క్రిప్టింగ్తో సినిమాకి నయా లుక్‌ను తెచ్చారు. ముఖ్యంగా హీరో పాత్ర, సంఘర్షణ, మాటలు సినిమాను ప్రత్యేకంగా మార్చాయి.
తండ్రిపై ఎనలేని ప్రేమ ఉన్న ఓ కొడుకు పూర్తి జీవితాన్ని తెరపైన ఆవిష్కరించే ప్రయత్నం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. 'అర్జున్ రెడ్డి' తరహాలో ఓ చిన్న స్టోరీతో సినిమాను మొదలుపెట్టిన సందీప్.. ఆ తర్వాత హీరో బాల్యం, అతని లవ్ స్టోరీతో సినిమాను ముందుకు నడిపించారు. తన సోదరిని ర్యాగింగ్ చేశారని కాలేజీకి వెళ్లి చేసే హంగామా నుంచి సినిమాలో మరింత వేగం పుంజుకుంటుంది. ఆ ఎపిసోడ్‌తో పాటు, చాలా సన్నివేశాలు 'అర్జున్ రెడ్డి' సినిమాను గుర్తు చేస్తాయి.
Animal Movie Review In Telugu :హీరో హీరోయిన్ల మధ్య జరిగే లవ్ స్టోరీనీ కూడా ఆసక్తికరంగా మొదలుపెట్టిన డైరెక్టర్.. భార్యా భర్తలుగా వాళ్ల ప్రయాణాన్ని చాలా బాగా డిజైన్ చేశారు. కథానాయకుడు అమెరికా నుంచి వచ్చాక అసలు సంఘర్షణ మొదలవుతుంది. బల్బీర్ సింగ్‌పై హత్యాయత్నం తర్వాత అసలు కథ మొదలవుతుంది. తన తండ్రికి ప్రాణాపాయం ఉందని తెలుసుకున్న విజయ్.. తనదైన ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే తీరు ఆ నేపథ్యంలో పండిన ఎమోషన్స్ సినిమాకి ప్రధానబలం. మనిషిని పోలిన మనిషిని ఈ కథలోకి తీసుకొచ్చే అంశం సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇక విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. బుల్లెట్ల వర్షం కురుస్తూ సాగే ఆ సీన్స్ మాస్ ప్రేక్షకుల్ని కిక్కెంచేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లోనే దాదాపు కథ ఉంటుంది.